- మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
- నియోజకవర్గంలో 5,500 ముస్లిం కుటుంబాలకు తోఫా అందజేత
- నస్పూర్ అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్న ఎమ్మెల్యే
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాజకీయాలకు అతీతంగా, గెలుపోటములతో సంబంధం లేకుండా గత ఏడు సంవత్సరాలుగా ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. శనివారం నస్పూర్ పట్టణంలోని ఎంఎం గార్డెన్‌లో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఆయన ఈ కానుకలను అందజేశారు. నియోజకవర్గంలోని సుమారు 5,500 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమం ప్రతి ఏడాది నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం
చేశారు. మంచిర్యాల పట్టణంతో సమానంగా నస్పూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ప్రేమ్ సాగర్ రావు వివరించారు. ఈ ఉద్దేశంతోనే నస్పూర్ ప్రాంతానికి మేయర్ అవకాశం కల్పించినట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజలందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలతో పాటు మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేగా తన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తానని ప్రకటించారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ సంఖ్యలో గెలిపించి మంచిర్యాల కాంగ్రెస్ అడ్డా అని నిరూపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నగరపాలక సంస్థ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







