- మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
- ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాలను రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37, 55, 14 డివిజన్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత పేరిట నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రతి డివిజన్ లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పారిశుద్ధ్య పనులను నిశితంగా పరిశీలించిన ఆయన మున్సిపల్ సిబ్బందితో చర్చించారు. వార్డుల్లోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సిబ్బందికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. పట్టణ అభివృద్ధిలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







