బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్: జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో జనహిత అన్నపూర్ణ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 400వ సారి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రాంచెందర్, టిపిసిసి జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్ మాట్లాడుతూ, అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా నిరుపేదలు, బాటసారుల ఆకలి తీర్చేందుకు నిర్విరామంగా అన్నదానం నిర్వహించడం అభినందనీయం అన్నారు. అలాగే రక్తదాన శిబిరాలు, నేత్రదానం, అవయవ దానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనహిత సభ్యులను అభినందించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రాంచెందర్ మాట్లాడుతూ, జనహిత సేవా సమితి చేపడుతున్న అన్నదాన కార్యక్రమాలు, నిత్య జనగణమన, రక్తదాన శిబిరాలు వంటి సేవలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తూ తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. టిపిసిసి జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి మాట్లాడుతూ, జనహిత సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ, ఉగాది సందర్భంగా 2021 ఏప్రిల్ 13న ప్రారంభమైన జనహిత అన్నపూర్ణ కార్యక్రమం ప్రతి బుధవారం నిరంతరం కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు 400 సార్లు సుమారు రూ.27 లక్షల వ్యయంతో వేలాది మందికి అన్నదానం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అన్నదాతలు, శాశ్వత దాతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అన్నదాన కార్యక్రమం కోసం శాశ్వత స్థలం కేటాయించి కేంద్ర నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా నిత్య జనగణమన కార్యక్రమంలో సేవలందిస్తున్న షఫీ, కొయ్యడ శంకర్ గౌడ్లతో పాటు వంట మాస్టర్ నిచ్ఛకోల గురుస్వామి, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆడెపు సతీష్లను శాలువాలతో సత్కరించి స్మారక చిహ్నాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ సింగ్, నాయకులు గెల్లి రమాకాంత్, హనుమాండ్ల మధుకర్, శాశ్వత అన్నదాతలు, జనహిత సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







