యూనిఫాం ఆర్డర్ల రద్దుపై ఆగ్రహం.. పీకల్లోతు కష్టాల్లో చేనేత కుటుంబాలు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ డిమాండ్ చేసింది. 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేనేతలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసిన ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత చేనేతలపై ఉక్కుపాదం మోపుతోందని నేతలు విమర్శించారు. గతంలో ఉన్న సంక్షేమ పథకాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యార్థుల యూనిఫాంల తయారీ కోసం కేటాయించిన 105.54 కోట్ల రూపాయల ఆర్డర్‌ను రద్దు చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా చేనేత కుటుంబాలను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టిందని ఆవేదన చెందారు. సంక్షేమ శాఖలకు అవసరమైన 200 కోట్ల రూపాయల విలువైన దుస్తులు, దుప్పట్ల తయారీ ఆర్డర్లు కూడా ఇవ్వకపోవడం వల్ల టెస్కోతో పాటు కార్మికులు మనస్తాపానికి గురవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఆర్థిక ఇబ్బందులతో 36 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని తెలిపారు. స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, అలె నరేంద్ర, సిరిపురపు యాదయ్య వంటి వారి త్యాగాలను ప్రభుత్వం మరువకూడదని హితవు పలికారు. రద్దు చేసిన యూనిఫాం ఆర్డర్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నేతన్నకు చేయూత పథకం ద్వారా నగదు సాయం అందించి ఆదాయం పెంచాలని కోరారు. నూలు, రంగులను తక్కువ ధరకే అందించాలని, తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని సూచించారు. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించి ఆన్లైన్ అమ్మకాలకు సహకరించాలని కోరారు. జౌళి శాఖ నుండి చేనేత విభాగాన్ని వేరు చేయాలని, సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గజెల్లి వెంకటయ్య, రుక్మ రావు, అడిచర్ల రాజేశం, రవి, శ్రీనివాస్, నారాయణ, సత్యనారాయణ పాల్గొన్నారు.







