నగదు, వెండి గొలుసులు, అమెరికన్ డాలర్ల రికవరీ.. సిబ్బందిని అభినందించిన రూరల్ సీఐ
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నగదు, వెండి పట్టా గొలుసులు, అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం దోనబండ బస్ స్టాప్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పట్టుకుని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. నిందితులు తోకల రమేష్, తౌటం అశోక్ గత నెల 25వ తేదీ రాత్రి ముల్కల్ల గ్రామానికి చెందిన దర్వాజ రాజయ్య ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 2000 రూపాయల నగదు, మూడు తులాల వెండి పట్టా గొలుసులు, 20 అమెరికన్ డాలర్లను దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు. తక్కువ సమయంలోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన హాజీపూర్ ఎస్ ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుళ్లు జి. చంద్రశేకర్, బి. తిరుపతిలను మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్ అభినందించారు. నిందితులపై నిఘా ఉంచడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్లకు పటిష్టమైన తాళాలు వేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.







