- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
- ఆర్కే 7 గనిలో ఉత్పత్తి లక్ష్యాలపై క్షేత్రస్థాయి సమీక్ష
నస్పూర్, ఆర్.కె న్యూస్: సంస్థ మనుగడ నిర్దేశిత లక్ష్యాల సాధనపైనే ఆధారపడి ఉందని, భూగర్భ గనులు ఓపెన్ కాస్ట్ గనులకు ధీటుగా రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిని సాధించాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని ఆర్.కె 7 భూగర్భ గనిలో అధికారులు, సేఫ్టీ కమిటీ, మైనింగ్ సిబ్బందితో నిర్వహించిన క్షేత్రస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేసి ఉత్పత్తి, ఉత్పాదకత పెంచే దిశగా అడుగులు వేయాలని సూచించారు. సమావేశంలో భాగంగా డీజీఎం రాజన్న గత ఆర్థిక సంవత్సరపు ఉత్పత్తి వివరాలు, యంత్రాల వినియోగం, ఎదురైన లోటుపాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ఏడాది ఆర్.కె 7 గని స్వల్ప తేడాతో లక్ష్యానికి దూరమైన విషయాన్ని జీఎం గుర్తు చేస్తూ, ఈసారి నూటికి నూరు శాతం ఉత్పత్తి సాధించాలని ఆదేశించారు. గనిలో డ్రిల్స్ సంఖ్యను పెంచడంతో పాటు ఎస్‌డీఎల్ యంత్రాల ద్వారా బొగ్గు వెలికితీత శాతాన్ని మెరుగుపరచాలని ప్రణాళికలు రూపొందించారు. మ్యాన్ పవర్ పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రక్షణ సూత్రాలను విస్మరించకుండా నాణ్యమైన బొగ్గును వెలికితీయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఏజెంట్ కె. రాజేందర్, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, గని మేనేజర్ తిరుపతి, పిట్ ఇంజనీర్ ప్రవీణ్, సేఫ్టీ ఆఫీసర్ సంతోష్, సంక్షేమ అధికారి సంతన్, పిట్ సెక్రటరీ సారయ్య, గని సిబ్బంది పాల్గొన్నారు.







