నస్పూర్, ఆర్.కె న్యూస్: ఆర్.కె 5 గనిలో నెలకొన్న డ్రిల్ బిట్లు, డ్రిల్ రాడ్ల కొరతను వెంటనే తీర్చి కార్మికులకు ఆటంకం లేకుండా చూడాలని ఏఐటీయూసీ నాయకత్వం డిమాండ్ చేసింది. మంగళవారం యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కే. వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కే. బాజీ సైదా ఆర్.కె 5 గనిని సందర్శించారు. ఈ సందర్భంగా గనిలో క్షేత్రస్థాయిలో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రూఫ్ బోల్టర్ మిషన్ పని ప్రదేశానికి చాలా దూరంగా ఉండటం వల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, దానిని పని ప్రదేశానికి సమీపంలోనే ఏర్పాటు చేయాలని కార్మికులు నాయకుల దృష్టికి తెచ్చారు. వీటితో పాటు తుంటలు, గుటకలు, హ్యాండ్ గ్లౌజ్‌లు, ప్యాకింగ్ చెక్కల కొరత వేధిస్తోందని వివరించారు. ఎస్డీఎల్ యంత్రాలకు లీడ్ ఎక్కువగా ఉండటం, 27వ లెవల్లో తాగునీటి సౌకర్యం సరిగా లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం యూనియన్ నాయకులు గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝాను కలిసి కార్మికుల సమస్యలను వివరించారు. స్పందించిన మేనేజర్, గనిలో ఎదురవుతున్న ఇబ్బందులపై సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్ కార్యదర్శి జి. నర్సింగరావు, సంఘ రాజయ్య, భోగ మధునయ్య, నాగుల రాజయ్య, శంకర్, వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు.
11







