- మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గాదె సత్యం
- బీసీ కులగణన మళ్లీ నిర్వహించాలని డిమాండ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణలో మున్నూరు కాపుల జనాభా 40 లక్షలకు పైగా ఉంటే, కులగణనలో తక్కువగా చూపడం అన్యాయమని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గాదె సత్యం ఆరోపించారు. గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో సుమారు 9 శాతంగా ఉండాల్సిన తమ జనాభాను 6 శాతం కన్నా తక్కువగా చూపడాన్ని తీవ్రంగా ఖండించారు. బీసీ కులగణనను నిష్పక్షపాతంగా మళ్లీ నిర్వహించి వాస్తవ లెక్కలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని, ప్రభుత్వ సలహాదారుగా వి. హనుమంతరావును నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే, కార్పొరేషన్‌కు ఎన్నికల హామీ మేరకు నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్ర క్యాబినెట్‌లో మున్నూరు కాపులకు జనాభా దామాషా ప్రకారం సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపులందరూ ఏకమై కుల సంఘం బలోపేతానికి కృషి చేయాలని, అంతర్గత విభేదాలను సరిదిద్దుకుని ముందుకు సాగుతామని వెల్లడించారు. మున్నూరు కాపులలో ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం అందించడానికి సంఘం కృషి చేస్తుందని తెలిపారు. జిల్లాలో మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, సామాజికంగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సల్ల నరేష్, బోయిని హరికృష్ణ, తోట తిరుపతి, బండారి తిరుపతి, పుప్పాల స్వర్ణాకర్, రమేష్, రవీందర్, మల్లేష్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.







