స్వయం ఉపాధి యూనిట్ల కోసం 153 మంది అభ్యర్థుల హాజరు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు అధికారులు గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి మున్సిపల్ కార్యాలయంలో ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, పాడి గేదెల యూనిట్ల మంజూరు కోసం అభ్యర్థుల అర్హతలను అధికారులు పరిశీలించారు. ఈ పథకం కింద వివిధ రకాల వ్యాపారాలు నెలకొల్పుకోవడానికి మొత్తం 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 153 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి వెంకటేశం, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ అభ్యర్థుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగ యువత సొంతంగా వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రుణాలను మంజూరు చేస్తోందని అధికారులు వివరించారు. బ్యాంకుల నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ త్వరితగతిన రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, వివిధ బ్యాంకుల మేనేజర్లు మస్తాన్ షేక్, రాజేష్, మెప్మా టీఎంసీ చంద్రయ్య, సిఓలు, ఆర్పీలు పాల్గొన్నారు.







