- బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వ లక్ష్మి నారాయణ
- నస్పూర్ లో జాతీయ రహదారి పై బీజేపీ భారీ ధర్నా
- అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం తరుగు పేరుతో రైతులు పండించిన ధాన్యాన్ని బస్తాకు నాలుగు కిలోల చొప్పున దోచుకుంటోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వ లక్ష్మి నారాయణ ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీజేపీ ఆధ్వర్యంలో నస్పూర్ లోని జిల్లా కలెక్టరేట్ సమీపంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని లారీల కొరత కారణంగా మిల్లులకు తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లక్ష్మి నారాయణ విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కమీషన్ల కోసం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. లక్షెట్టిపేట మండలంలో ఇటీవల మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు విధించకుండా తక్షణమే ధాన్యం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు రశీదులు అందజేయాలని నాయకులు పేర్కొన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దుర్గం అశోక్, కొయ్యల ఎమాజీ, కోడి రమేష్, గోపతి రాజన్న, అమిరిశెట్టి రాజ్ కుమార్, కుర్రె చక్రి, సత్రం రమేష్, రంగ శ్రీశైలం, వీరమల్ల హరి గోపాల్ సహా పలువురు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.







