శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆకుల అశోక్
శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్.. నార్కోటిక్ టెస్టుల నిర్వహణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆకుల అశోక్ హెచ్చరించారు. నేరాల నియంత్రణలో భాగంగా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్ ఉన్న వ్యక్తులను పిలిపించి శనివారం వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, రాత్రి వేళల్లో గొడవలు సృష్టించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సమాజంలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, రౌడీ షీటర్లకు యూరిన్ నార్కోటిక్ కిట్ల ద్వారా డ్రగ్స్ పరీక్షలు చేయించారు. డాక్టర్ల సమక్షంలో వారికి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వారిని డి-అడిక్షన్ సెంటర్లకు తరలిస్తామని పోలీసులు వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించే వారిని తక్షణమే రిమాండ్‌కు పంపిస్తామని తెలిపారు. శ్రీరాంపూర్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఇన్‌స్పెక్టర్ అశోక్ పేర్కొన్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు తమ ప్రవర్తన మార్చుకుని సాధారణ జీవితం గడపాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఎస్సై మేకల సంతోష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







