వరి ధాన్యం కుప్పల వద్ద నిరసన వ్యక్తం చేసిన రైతులు
సోన్, ఆర్.కె న్యూస్: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ఎఫ్ ఎస్ సి ఎస్, ఐకెపి, పిఎసిఎస్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాల్లో లారీల, లేబర్ కొరతతో ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం రైతులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి ఎండనక, వాననక పండించిన పంటను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడవలసి వస్తుందని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దిక్కు వర్షాభావ ప్రభావం , ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వస్తుందన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నామని అన్నారు. పంట అమ్ముకునేదాకా నిద్ర పట్టకుండా చేస్తుందని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస అవసరాలైన, మంచినీరు టెంట్, టార్పాలిన్ కవర్లు కూడా అందుబాటులో లేవని రైతులు వాపోయారు. తక్షణమే లారీల , లేబర్ కొరత లేకుండా ప్రభుత్వం, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా న్యూ వెల్మల్ గ్రామంలో ఎఫ్ ఎస్ సి ఎస్ ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు ఒక్కటే లారీ, లోడింగ్ చేశామని అన్లోడింగ్ ఇంకా కాలేదని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు వీడిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







