ఏఐటీయూసీతో డైరెక్టర్ (పర్సనల్) చర్చలు సఫలం.. కీలక హామీల మంజూరు
నస్పూర్, ఆర్.కె న్యూస్: హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో మంగళవారం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులతో డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పొట్రు నిర్వహించిన సమావేశం విజయవంతమైంది. కార్మికులు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాలపు పెండింగ్ సమస్యలపై చర్చించిన యాజమాన్యం, పలు కీలక అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో కార్మిక హక్కుల పరిరక్షణకు సంబంధించి పలు హామీలను డైరెక్టర్ వెల్లడించారు. నెల రోజుల్లోపు మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తామని, ఆసుపత్రుల్లో ఆధార్ వివరాలు మారిన వారికి సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న 337 మంది డిపెండెంట్‌లకు ఉద్యోగాలు కల్పిస్తామని, అన్‌ఫిట్ అయిన మైనింగ్, ట్రేడ్స్‌మెన్ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. మారుపేర్ల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.రిటైర్డ్ కార్మికులకు నిలిపివేసిన లాభాల వాటా, దీపావళి బోనస్ చెల్లించేందుకు అంగీకరించారు. అండర్‌గ్రౌండ్ అలవెన్స్ కట్టింగ్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఖాళీలు ఉన్నచోట మూడు సంవత్సరాల నిబంధనతో సంబంధం లేకుండా వెంటనే ట్రాన్స్‌ఫర్లు చేపడతామని, ఓవర్‌మన్‌లకు పెండింగ్ ప్రమోషన్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. సొంత ఇంటి పథకం, పెర్క్స్‌పై ట్యాక్స్ సమస్యలను వచ్చే స్ట్రక్చర్ మీటింగ్‌లో చర్చించి ఖరారు చేస్తామని, క్వార్టర్లు ఖాళీ చేసిన వెంటనే వెకేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
వీఆర్ఎస్ ఉండదు.. డైరెక్టర్ స్పష్టత:
సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్‌షేక్ లేదా వీఆర్ఎస్ వంటి పథకాలను అమలు చేసే ఉద్దేశం యాజమాన్యానికి లేదని డైరెక్టర్ గౌతమ్ పొట్రు స్పష్టం చేశారు. అలాగే జనరల్ సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికులకు పీనల్ వేజ్ కట్టింగ్‌ను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన సమస్యలను త్వరలో సీఎండీ స్థాయి సమావేశంలో చర్చించి పరిష్కరిస్తామన్నారు.







