- మాతా శిశు సంరక్షణ, టీకాల వివరాలను పోర్టళ్లలో 100 శాతం నమోదు చేయాలి
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్
- జిల్లా వైద్యాధికారులతో వ్యాధుల నివారణపై సమీక్షా సమావేశం
నస్పూర్, ఆర్.కె న్యూస్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మండల అధికారుల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశించారు. మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా సాగుతున్న సేవలపై ఆరా తీస్తూ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా మాతా శిశు సంరక్షణ నమోదు 100 శాతం పూర్తి చేయాలన్నారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, హైరిస్క్ గర్భవతులను గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ వివరాలను మాతా శిశు సంరక్షణ పోర్టల్‌లో, టీకాల వివరాలను యు-విన్ పోర్టల్‌లో 100 శాతం నమోదు చేయాలన్నారు. జాతీయ క్షయ వ్యాధి నియంత్రణలో భాగంగా పోర్టబుల్ ఎక్స్-రేల ద్వారా బాధితులను గుర్తించాలని, మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆశా కార్యకర్తలు నిత్యం గ్రామాలను సందర్శిస్తూ కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా సర్పంచులు, పంచాయతీ సిబ్బంది సహకారంతో దోమల నివారణకు పరిసరాల పరిశుభ్రత చేపట్టాలన్నారు. ప్రతి ఇంటా ఓఆర్‌ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. 30 ఏళ్లు పైబడిన వారందరికీ అసంక్రమణ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసి బీపీ, షుగర్ మందులను సమయానికి అందజేయాలని సీహెచ్‌ఓలు, వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే ఈ-ఔషధ్, టెలి మనస్ కార్యక్రమాలను 100 శాతం పూర్తి చేయాలని, పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలలను వైద్యులు, సూపర్‌వైజర్లు నిరంతరం సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై తగు సూచనలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్‌ఓ కాకిరాల వెంకటేశ్వర్లు, డీడీఎం ప్రవళికతో పాటు పలువురు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







