- జెన్‌కో ద్వారా టెండర్ల ప్రక్రియ వల్ల సింగరేణి ఆర్థిక ప్రయోజనాలకు తీవ్ర గండి
- జెండాలు, రాజకీయాలు పక్కనపెట్టి యూనియన్లన్నీ ఐక్యపోరాటానికి రావాలి
- సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ అధ్యక్షులు అప్పాని శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కెన్యూస్: మణుగూరు పీకే ఓసీ డీప్ ప్రాజెక్టును సింగరేణికి దక్కకుండా జెన్‌కో ద్వారా టెండర్ల ప్రక్రియ చేపట్టడం వల్ల సింగరేణి సంస్థ ఆర్థిక ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) అధ్యక్షులు అప్పాని శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కార్మికులు, కార్మిక సంఘాలు, యాజమాన్యం ఏకగ్రీవంగా కోరుతున్నప్పటికీ, జెన్‌కోను పోటీలో నిలిపి టెండర్ల ప్రక్రియ నిర్వహించడం సరికాదన్నారు. ఇది తాడిచర్ల-1 తరహాలో కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకే జరుగుతున్న ప్రయత్నమని ఆరోపించారు. మణుగూరు పీకే ఓసీ డీప్ ప్రాజెక్టు సింగరేణికి దక్కితే మణుగూరు ప్రాంతానికి మరో 35 సంవత్సరాల పాటు ఉపాధి, ఉత్పత్తి, ప్రాంతీయ అభివృద్ధికి తిరుగులేని భరోసా లభిస్తుందని అప్పాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. సంస్థ ప్రయోజనాలు, కార్మికుల భవిష్యత్తు ముడిపడి ఉన్న ఈ అంశంలో అన్ని కార్మిక సంఘాలు తమ జెండాలను, రాజకీయ భేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి భవిష్యత్తు కోసం బీఎంఎస్ ఐక్యపోరాటానికి పిలుపునిస్తోందని చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడుకుందాం, కార్మికుల భవిష్యత్తును రక్షించుకుందాం అని అప్పాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సంస్థ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వ విధానాలపై కార్మికులందరూ ఐక్యంగా తమ గళాన్ని వినిపించాలని, మణుగూరు పీకే ఓసీ డీప్ ప్రాజెక్టును సాధించుకునే వరకు పోరాటాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.







