నస్పూర్లో ప్లకార్డులతో నిరసన
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఆదివాసీ యువతి ఊక శిరీషపై అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేసిన దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నస్పూర్ మండల కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకుడు చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్న ఆదివాసీ బిడ్డ శిరీష దారుణ హత్యకు గురికావడం అత్యంత బాధాకరమన్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా నిందితులను పట్టుకోకపోవడం ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. మహిళలు, యువతులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చేసి ప్రజల్లో, ఆడబిడ్డల్లో భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేసును నిష్పక్షపాతంగా, వేగవంతంగా దర్యాప్తు చేసి దోషులను చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా కఠిన రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల ప్రతినిధులు జుమ్మిడి గోపాల్, పూరెళ్ల నితీష్, వంశీ, పవన్, ప్రశాంత్, అలేఖ్య, హరిణి, శివాని తదితరులు పాల్గొన్నారు.







