శ్రీరాంపూర్‌లో పనిచేయలేకపోవడమే నా సర్వీసులో తీరని లోటు
- సింగరేణి డైరెక్టర్ (పీపీ) కె. వెంకటేశ్వర్లు
- ఘనంగా ఎస్‌ఆర్‌పీ 1 స్వర్ణోత్సవ వేడుకలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: పరిస్థితులు మారాయి, పోటీ పెరిగింది, నల్లనిదంతా బొగ్గు అని చెప్పి అమ్మే రోజులు పోయాయి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన బొగ్గును అందిస్తేనే సంస్థ మనుగడ సాధ్యమని సింగరేణి సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్‌ఆర్‌పీ 1 భూగర్భ గని 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గని ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి గోల్డెన్ జూబ్లీ పైలాన్‌ను ప్రారంభించి, స్వర్ణోత్సవ జ్ఞాపికను ఆవిష్కరించారు. దక్షిణ భారతదేశంలో ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన సింగరేణిలో ఒక అండర్‌గ్రౌండ్ మైన్ ఒడిదుడుకులను తట్టుకొని వంద శాతం
ఉత్పత్తితో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం హర్షణీయమన్నారు. నా 35 ఏళ్ల సింగరేణి ఉద్యోగ ప్రస్థానంలో ఎన్నో హోదాల్లో పనిచేసి డైరెక్టర్ స్థాయికి ఎదిగినా, ఒక్కసారైనా శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేసే అవకాశం రాకపోవడమే నా సర్వీసులో మిగిలిపోయిన తీరని కోరిక అని అన్నారు. దేశంలోనే అత్యధిక ఉత్పత్తి వ్యయం సింగరేణిలోనే ఉందని, ధర తగ్గిస్తేనే వినియోగదారులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని డైరెక్టర్ పేర్కొన్నారు. రైల్వే నాలుగో లైన్ నిర్మాణం పూర్తయితే దేశంలో ఎక్కడి నుంచైనా బొగ్గు రవాణా సులభతరం అవుతుందని, ఇది సంస్థకు మరింత పోటీని తెచ్చిపెడుతుందని హెచ్చరించారు. భూగర్భ గనుల్లో నష్టాలు రాకుండా యంత్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో వినియోగించుకోవాలని కోరారు. సంస్థలో యువ ఉద్యోగుల సంఖ్య పెరిగిందని, వారు గైర్హాజరు కాకుండా విధులు నిర్వర్తిస్తూ జీరో హార్మ్ లక్ష్యంతో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సూచించారు. బొగ్గుతో పాటు సంస్థ ఇతర వ్యాపారాలపై దృష్టి సారించిందని, కర్ణాటకలో బంగారు గనుల అన్వేషణ చేపడుతోందని తెలిపారు. ఒక దశలో తీవ్ర నష్టాల కారణంగా మూసివేత అంచున చేరిన ఎస్‌ఆర్‌పీ 1 గనిని కార్మికులు, సంఘాలు ఐక్యంగా శ్రమించి లాభాల బాట పట్టించారని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కొనియాడారు. అనంతరం శ్రీరాంపూర్ జీఎం మాట్లాడుతూ, ఉత్పత్తి, రక్షణ విభాగాల్లో ఎస్‌ఆర్‌పీ 1 గని శ్రీరాంపూర్ ఏరియాకే గర్వకారణమని పేర్కొన్నారు. 2018లోనే ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి మిగిలిన గనులకు ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. ఈ వేడుకల్లో బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్ర రావు, ఆర్జీ రీజియన్ క్వాలిటీ జీఎం వెంకట్ రమణ, విశ్రాంత సీజీఎం సుగుణాకర్ రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్ రావు, సీఎంఓఏఐ అపెక్స్ కౌన్సిల్ సీనియర్ ఉపాధ్యక్షుడు ఏవీ రెడ్డి, గని ఏజెంట్ రవికుమార్, మేనేజర్ ఆత్మారాం సహానీ, అధికారులు, ఉద్యోగులు, విశ్రాంత కార్మికులు పాల్గొన్నారు.







