సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండల కేంద్రంలోని సీఎస్ఐ చర్చి 80 వసంతాల ఆవిర్భావ మహోత్సవ వేడుకలను స్థానిక గురువులు రెవరెండ్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొయినుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరై చర్చి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం క్రైస్తవులకు సీఎస్ఐ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అతిథులను రెవరెండ్ కిరణ్ కుమార్ శాలువాలతో సన్మానించారు. అనంతరం క్రైస్తవ సోదరసోదరీమణులు భక్తిగీతాలు ఆలపిస్తూ ప్రత్యేక ఆరాధనల్లో పాల్గొన్నారు. దూదిగం పాస్టరేట్ ఇన్ఛార్జ్ రెవరెండ్ కమలాకర్ సీఎస్ఐ చరిత్ర, విశిష్టతను వివరిస్తూ వాక్యోపదేశం చేశారు. అనంతరం పాస్టర్లను సంఘ సభ్యులు సత్కరించారు. వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, చివరగా ఏర్పాటు చేసిన ప్రేమ విందులో అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు పాల్ సువర్ణరాజ్, కొరటికల్ పాస్టర్ రెవరెండ్ డి. సోలమోన్ రాజ్, సోన్, మాదాపూర్, మాదాపూర్ కాలనీ, కొరటికల్ గ్రామాల క్రైస్తవ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
10







