పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్
సింగరేణి పెరిక కుల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆవిర్భావం
నస్పూర్, ఆర్.కె న్యూస్: కష్టాన్ని నమ్ముకుని పనిచేసే పెరిక ఉద్యోగులు కేవలం ఉద్యోగ బాధ్యతలకే పరిమితం కాకుండా సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదగాలని పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న పెరిక ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన “సింగరేణి పెరిక కుల ఉద్యోగుల సంక్షేమ సంఘం” ఆవిర్భావ మహాసభ శుక్రవారం నస్పూర్ మండలం శ్రీరాంపూర్‌లోని పీవీఆర్ గార్డెన్లో ఘనంగా జరిగింది. సింగరేణి కన్వీనర్ పేరం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు సుమారు 400 మంది కార్మికులు, ఉద్యోగులు హాజరై ప్రాథమిక సభ్యత్వాలు తీసుకున్నారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గటిక విజయ్ కుమార్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న పెరిక ఉద్యోగులకు తమ అంకితభావం, నిజాయితీతో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. నూతనంగా ఏర్పాటైన ఈ సంఘం ద్వారా ఉద్యోగుల ఐఆర్ సమస్యలు, కార్మిక హక్కులను సాధించుకోవడంతో పాటు పరస్పర ఐక్యతను పెంపొందించుకోవాలని సూచించారు. త్వరలోనే సింగరేణిలోని 12 ఏరియాల్లోనూ శాఖలను ఏర్పాటు చేసి, రాష్ట్ర సంఘానికి అనుబంధంగా ప్రత్యేక ట్రస్ట్‌ను నెలకొల్పి సేవా కార్యక్రమాలు విస్తరిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో శ్రీరాంపూర్ ఏరియా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏరియా అధ్యక్షుడిగా తీర్థాల సదానందం (ఎస్ అండ్ పీసీ), ఉపాధ్యక్షుడిగా ఆకుల కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శిగా కారకూరి శ్రీనివాస్, కార్యదర్శిగా ఎంబడి శ్రీనివాస్, కోశాధికారిగా పేరం మనోహర్‌లు ఎన్నికయ్యారు.
హైదరాబాద్‌లో గత 50 ఏళ్లుగా పెరిక హాస్టల్ ద్వారా ఎందరో పేద, బలహీన వర్గాల విద్యార్థులకు వసతి, ఉన్నత విద్యను అందిస్తున్నామని ఆయన వివరించారు. ఎల్బీనగర్లో విద్యార్థినుల కోసం వసతి గృహం ఏర్పాటు చేయడంతో పాటు, కోకాపేటలో ప్రభుత్వం కేటాయించిన రెండెకరాల స్థలంలో నిర్మిస్తున్న తొమ్మిది అంతస్తుల అత్యాధునిక భవనంలో ఇప్పటికే ఆరు అంతస్తుల స్లాబ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. మంచిర్యాలలోనూ త్వరలోనే పెరిక హాస్టల్ భవనాన్ని నిర్మించి విద్యార్థులకు నాణ్యమైన విద్యా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, కోకాపేట భవన వైస్ చైర్మన్ చుంచు ఉషన్న, పెరిక హాస్టల్ ప్రధాన కార్యదర్శి అచ్చ రఘుకుమార్, రాష్ట్ర నాయకులు బోడకుంట ప్రకాష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, జిల్లా అధ్యక్షుడు బొడ్డు శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజ్‌కిరణ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అత్తి సరోజ, నాయకులు అక్కల రమేష్, ఒడ్డె రాజమౌళి, మోటపలుకుల తిరుపతి, మేడం తిరుపతి, నెల్కి మల్లేష్, మండల అధ్యక్షులు ఎంబడి కుమారస్వామి, పెట్టెం లక్ష్మణ్, బేర సత్యనారాయణ, రెంక రవి తదితరులు పాల్గొన్నారు.








