- రూ. 15,300 నగదు, 6 సెల్‌ఫోన్లు, 3 బైక్‌లు స్వాధీనం
- చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: పోలీసుల హెచ్చరిక
నస్పూర్, ఆర్.కె న్యూస్: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమ, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా రామగుండం టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ టీమ్ ఆదివారం సాయంత్రం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఎస్ఆర్ నగర్‌లో ఆకస్మిక దాడి నిర్వహించింది. డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కలాట (పేకాట) ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఏసీపీ పర్యవేక్షణలో ఎస్సైలు దీకొండ రమేష్, లచ్చన్న, సీసీసీ నస్పూర్ ఎస్సై ఎండీ తహిసీనుద్దీన్ తమ సిబ్బందితో కలిసి సంయుక్తంగా ఈ దాడి చేపట్టారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 52 పేక ముక్కలు, రూ. 15,300 నగదు, 6 మొబైల్ ఫోన్లు మరియు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారి వివరాలు:
పట్టుబడిన వారిలో ఏఎస్ఆర్ నగర్‌కు చెందిన ముద్దసాని సదానందం, శ్రీరామ్ నగర్ వాసి ఆచే రవి, విద్యానగర్‌కు చెందిన పాదాల సంజీవ్, ఫ్లడ్ కాలనీ నివాసి నాగపురి మహేష్, రామ్ నగర్‌కు చెందిన దుర్గం శ్రీనివాస్, జడల రాజమౌళి, చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన దంతాల శ్రీనివాస్, శ్రీరాంపూర్ వాసి రాజవరపు వెంకటేశ్వర్లు ఉన్నారు.
స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులతో పాటు నిందితులను సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.







