ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టీబీజీకేఎస్ నేతలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-1 గని ప్రాంగణంలో ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారిని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దుర్గాదేవి చల్లని ఆశీస్సులతో కార్మిక కుటుంబాలన్నీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సింగరేణి సంస్థ మరింత ప్రగతి పథంలో పయనించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ మరియు యూనియన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









