ఆర్.కె-7 గని నూతన టీఎన్టీయూసీ పిట్ కమిటీ ఎన్నిక.. పిట్ సెక్రటరీగా కర్నే శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి పక్షాన నిలబడి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ (టీఎన్టీయూసీ) ప్రధాన కార్యదర్శి టి. మణిరామ్ సింగ్ పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గనిపై గురువారం నిర్వహించిన సమావేశంలో నూతన పిట్ కమిటీని ఎన్నుకోవడంతో పాటు పలువురు కార్మికులు యూనియన్లో చేరారు. ఆర్.కె-7 పిట్ సెక్రటరీగా కర్నే శ్రీనివాస్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీగా పెగడి శ్రీనివాస్,షిఫ్ట్ సెక్రటరీలుగా సిహెచ్. హర్షిత్, కె. లక్ష్మణ్, రఘుపతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు సింగరేణిని బీఐఎఫ్ఆర్ బారి నుంచి రక్షించి, అవినీతి లేకుండా 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని, లాభాల వాటాను ప్రారంభించారని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో 12వ వేజ్ బోర్డు, ఆదాయపు పన్ను రద్దు, సొంత ఇంటి పథకం, మారుపేర్ల సమస్య, రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపు, అధికారులతో సమానంగా సీపీఎంఆర్ఎస్ కింద రూ. 25 లక్షల వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ రోజే టెర్మినల్ బెనిఫిట్స్ సాధన కోసం చేపట్టే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి టి. మణిరామ్ సింగ్, ఉపాధ్యక్షులు గద్దల నారాయణ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ రఘుపతి, నాయకులు కె. లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి, పెగడి శ్రీనివాస్, ఎన్. పుల్లయ్య, పుల్లూరి పోశం, ఎస్కే అస్గర్ బాషా తదితరులు పాల్గొన్నారు.







