KYATHAM RAJESH
- రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య
నస్పూర్ (ఆర్.కె న్యూస్): విద్యారంగ అభివృద్ధిలో భాగంగా ప్రతిష్టాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటు కొరకు స్థల సేకరణపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించి, సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, కుమార్ దీపక్, అభిలాష అభినవ్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఉట్నూర్ అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, దీపక్ తివారి, యువరాజ్, ఆదిలాబాద్ ట్రైనీ కలెక్టర్ అభిగ్యన్ మొహియ లతో కలిసి విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (సమీకృత గురుకుల పాఠశాల)లను రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాలలో నిర్మించి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో సమీకృత గురుకుల పాఠశాలకు అవసరమైన స్థలాల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, సిసి కెమెరాలు, ప్రాక్టికల్, థియరీ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. కళాశాలలకు విద్యార్థుల హాజరు శాతం, స్లిప్ టెస్టులు, అడ్మిషన్ల ప్రక్రియ ఇతర అంశాలపై అధికారులతో సమీక్షించారు. స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయిన ప్రాంతంలో అవసరమైన అనుమతులు, సంబంధిత పనులను వేగవంతం చేయాలని, రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాలు అనువుగా ఉన్నాయా, లేదా పరిశీలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్ (ఆర్.కె న్యూస్): సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని కోరుతూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. బుధవారం శ్రీరాంపూర్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్)గా నియమించబడిన ఎల్.వి సూర్యనారాయణను గోదావరిఖని సింగరేణి గెస్ట్ హౌస్ లో బ్రాంచ్ అధ్యక్షులు గుల్ల బాలాజీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఆర్గనైజర్ సెక్రటరీ వెంగల శ్రీనివాస్, బ్రాంచ్ నాయకులు పెరుక సదానందం, గోదావరిఖని నాయకులు ఆరెపల్లి రాజమౌళి, నరహరి రావు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్ (ఆర్.కె న్యూస్): షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నస్పూర్ పట్టణానికి చెందిన తలారి రాజు నియమితులయ్యారు. ఈ మేరకు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. నర్సింగ్ నియామక పత్రం అందజేశారు. మంగళవారం తలారి రాజు అధ్యక్షతన శ్రీరాంపూర్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె నర్సింగ్ హాజరై మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ షెడ్యూల్డు కులాల సంక్షేమ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రభుత్వం ఎస్సీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని అన్నారు. నిరుద్యోగులైన షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఎస్సీ వర్గీకరణ వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. నియోజకవర్గ అధ్యక్షులుగా గుమ్మడి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులుగా శీలం రంజిత్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె నర్సింగ్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుట్ట రవి, చెవుల వాసు, తరాల విజయ్, చీమల రాజలింగు, సోగల రాములు, సొల్లు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
- ఏ.ఐ.ఎఫ్.బి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాబోయే ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపిస్తే పట్టభద్రులు, నిరుద్యోగులు, ప్రైవేట్ టీచర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ఎమ్మెల్సీ పదవికి వన్నె తెస్తానని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు పట్టం కట్టిన చరిత్ర ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఉందని, ప్రైవేట్ టీచర్లు చాలీ చాలని జీతాలతో పని చేస్తున్నారని, ప్రైవేట్ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని, నిరుద్యోగులకు ఒక్క రూపాయికే 5 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు విద్యావేత్తలు కాదని, విద్య వ్యాపారవేత్తలని, పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలిచిన, ఓడిన రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ తేడా ఏమి ఉందన్నారు. చట్ట ప్రకారం సీరియల్ నెంబర్ 4లో ఉండాల్సిన తన పేరును 11వ నెంబర్ లో పెట్టారని అన్నారు. ఐదు సార్లు కార్పొరేటర్ గా, మేయర్ గా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశానని, కరీంనగర్ మేయర్ గా ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్, ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేసే కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి తేజ్ రెడ్డి, రాము యాదవ్, క్రాంతి, సాయి వర్ధన్, సిజ్జు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- బాధితులకు తక్షణ సహాయం అందించాలి
- రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: లైంగిక దాడికి గురైన మహిళలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్ కు వచ్చి, పరిహారం ఇప్పించే వరకు “భరోసా కేంద్రాలు” అండగా నిలుస్తాయని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. సోమవారం సిసిసి నస్పూర్ పాత పోలీస్ స్టేషన్ భవనంలో నిర్వహిస్తున్న భరోసా కేంద్రాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలను అక్కున చేర్చుకుని వారికి వైద్య సహాయం, సైకాలజిస్ట్, న్యాయాధికారి, పోలీసులు న్యాయ సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలు బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ‘భరోసా’ కేంద్రం పని చేస్తుందని, బాధితులు రాగానే ఎవరి పరిధిలో వారు పనిచేస్తూ సత్వర న్యాయానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కల్పించడంతో పాటు వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మంచిర్యాల జోన్ లో ఎక్కడైనా పోక్సో, లైంగిక దాడుల కేసులు నమోదు కాగానే బాధితులను నేరుగా భరోసా కేంద్రానికి తీసుకొస్తున్నామన్నారు. తక్షణమే బాధితులకు సూచనలు, సలహాలు అందించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశిస్తున్నామని అన్నారు. బాధితులకు న్యాయ పరమైన సూచనలు అందించి, వారికి ఎవరూ లేనప్పుడు భరోసా సెంటర్ లో ఆశ్రయం కల్పించాలన్నారు. వీటితో పాటు ఈ భరోసా కేంద్రాలు బాధితులకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించి, వారు సమాజంలో ఉన్నతంగా జీవించడానికి దోహదపడుతాయన్నారు. అందుబాటులో వున్న లీగల్, మెడికల్, చిన్నారుల కౌన్సిలింగ్ గదులు, స్టేట్మెంట్ రికార్డు, సమావేశ గదులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్, మంచిర్యాల షీ టీమ్ ఇంచార్జి ఎస్ఐ హైమ, సీసీసీ నస్పూర్ ఎస్సై సుగుణాకర్, సిసి హరీష్ తదితరులు పాల్గొన్నారు.
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: దేశంలో మతాల, కులాల మధ్య చిచ్చుపెట్టే మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుదామని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని నర్సయ్య భవన్ లో జోగుల మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన సిపిఐ మంచిర్యాల నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ 1925లో కాన్పూర్ లో ఆవిర్భవించిందని, సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వందేళ్ల స్ఫూర్తితో కార్మిక రాజ్య స్థాపనకు పోరాడుదామని, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్రానికి స్వాతంత్య్ర ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ పని చేసిందని, దున్నేవాడికే భూమి ఉండాలని, పేద ప్రజల అభ్యున్నతికి అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టిందని, కార్మికవర్గ ఉద్యమాలకు సీపీఐ కేంద్ర బిందువు అని పేర్కొన్నారు. కార్మిక వర్గం కోసం కామ్రేడ్ పి. నర్సయ్య ప్రాణాలు అర్పించారని అన్నారు. నిరంతరం ప్రజల అభ్యున్నతికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షపాతిగా సిపిఐ పని చేస్తుందని అన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే పేద ప్రజల వికాసం కాకుండా కార్పొరేట్ కంపెనీల వికాసం మాత్రమే దేశంలో కొనసాగుతుందని విమర్శించారు. దేశంలో సమానత్వం ఉండకూడదని రాజ్యాంగ మౌలిక సూత్రాలు మార్చాలని బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. సంపద సృష్టికర్తలు అయిన కార్మికులకు, రైతు చట్టాలు మార్చి రైతులకు హక్కులు లేకుండా బిజెపి ప్రభుత్వం చేసిందని, బడా వ్యాపార వర్గాల కోసం మాత్రమే బిజెపి పని చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎస్.సి.డబ్ల్యూ.యూ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కారుకురి నగేష్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు మిర్యాల రాజేశ్వర్ రావు, ముస్కే సమ్మయ్య, బాజీ సైద, ఎన్.ఐ.ఎఫ్.డబ్ల్యు మహిళ సంఘం జిల్లా కార్యదర్శి రేగుంట చంద్ర కళ, నాయకులు కొట్టే కిషన్ రావు, మేదరి దేవవరం, కుంచాల శంకరయ్య, దొడ్డిపట్ల రవీందర్, దేవి పోచన్న, తోకల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
- మహిళా ఉద్యోగులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం
- సింగరేణి సీఎండీ ఎన్. బలరాం
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత సాధించాలని సింగరేణి సీఎండీ ఎన్. బలరాం అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 7, ఆర్.కె న్యూటెక్, ఆర్.కె 6, ఆర్.కె 5, ఎస్సార్పీ సి.హెచ్.పి, ఎస్సార్పీ ఓసీపీలను డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె. వెంకటేశ్వర్లు తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, ఉద్యోగులతో మాట్లాడి వారికి కావాల్సిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు వారికి కేటాయించిన విధులు తప్పనిసరిగా ఎనిమిది గంటల సమయంలో నిర్వర్తించాలని, గైర్హాజరు లేకుండా విధులు నిర్వర్తిస్తూ నిర్దేశిత లక్ష్య సాధనకు కృషి చేయాలని, భారీ యంత్రాల వినియోగ సమయం పెంచాలని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సంస్థ కలిపిస్తుందని, మహిళా ఉద్యోగులు వివిధ కేటగిరీలలో భూగర్భంలో విధులు నిర్వర్తిస్తూ ఉత్పత్తి, ఉత్పాదకతకు తమ వంతు కృషి చేయాలని సూచించారు. మహిళ ఉద్యోగులకు ఈపి ఆపరేటర్లుగా వెళ్లడానికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధన దిశగా ప్రతి ఒక్క ఉద్యోగి ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జనరల్ మేనేజర్ టి. శ్రీనివాస్, ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కే. వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ కె. రాజేందర్, ఆర్.కె 5, 6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, డిజిఎం (పర్సనల్) పి. అరవింద రావు, ఆర్.కె న్యూ టెక్ గని మేనేజర్ స్వామి రాజు, సి. హెచ్.పి ఇన్చార్జి డిజిఎం చంద్ర లింగం, ఆర్.కె 7 గని మేనేజర్ తిరుపతి, ఆర్.కె 6 గని మేనేజర్ ఈ. తిరుపతి., ఆర్.కె 5 గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝా, సీనియర్ పీవో పి. కాంతారావు, గుర్తింపు సంఘం యూనియన్ నాయకులు ముష్క సమ్మయ్య, వీరభద్రయ్య, వివిధ గనుల సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని శ్రీ రెయిన్ బో పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం వైజ్ఞానిక ప్రదర్శనను మండల విద్యాధికారి దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన పలు నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి దామోదర్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శన దోహద పడతాయన్నారు. ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ రజని, కరెస్పాండెంట్ అమన్ ప్రసాద్ లను మండల విద్యాధికారి దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ రజని, కరెస్పాండెంట్ అమన్ ప్రసాద్ లు మాట్లాడుతూ, వైజ్ఞానిక ప్రదర్శనలో కేవలం సైన్స్ అంశాలు మాత్రమే కాకుండా ఇతర విషయ పాఠ్యాంశాల ప్రదర్శనకు చోటు కల్పించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంపొందడానికి, జ్ఞాన సముపార్జనకు తల్లిదండ్రులు అందిస్తున్న సహకారానికి కృతఙ్ఞతలు తెలిపారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు వైజ్ఞానిక ప్రదర్శన తిలకించారు.