నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 18వ తేదీన నస్పూర్ డిస్పెన్సరీలో వెల్ బేబీ షోనిర్వహించనున్నట్లు శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఈ పోటీలకు అర్హులని తెలిపారు. కేవలం 1 నుండి 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. పోటీలలో పాల్గొనే ఉద్యోగులు తప్పనిసరిగా తమ ఐడి కార్డు, పిల్లల జనన ధృవీకరణ పత్రం, రోగ నిరోధక టీకాల కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. అర్హులైన ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KYATHAM RAJESH
సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమారాణి
వైభవంగా దీపాలంకరణ పోటీలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మహిళల భాగస్వామ్యంతోనే వేడుకలకు నిండుదనం చేకూరుతుందని శ్రీరాంపూర్ ఏరియా సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమారాణి అన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం నస్పూర్ కాలనీలోని మనోరంజన్ సముదాయిలో మహిళలకు దీపాలంకరణ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీరాంపూర్ ఏరియా సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమరాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలు పాల్గొనే ఏ కార్యక్రమమైనా తప్పక విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. శ్రీరాంపూర్ పరిసర ప్రాంతాల నుండి మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. నిత్యం ఇంటి పనుల్లో బిజీగా ఉండే మహిళలు, సమయం కేటాయించి ఇలాంటి పోటీల్లో తమ ప్రతిభను చాటుకోవడం అభినందనీయమని కొనియాడారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 23న సాయంత్రం శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో జరిగే సింగరేణి దినోత్సవ ప్రధాన వేడుకలలో బహుమతులు అందజేస్తామని ఉమారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మోత్కూరి కొమురయ్య, అకౌంట్స్ అధికారి పద్మ, సీనియర్ పర్సనల్ ఆఫీసర్లు ఎస్. సురేందర్, మురళి, ఏఐటీయూసీ నాయకులు కొట్టే కిషన్ రావు, సుజాత, శ్రీలత, సేవా సెక్రటరీ జ్యోతి, సేవా సభ్యురాళ్లు శారద, సునీత, రజిత, శిక్షకురాళ్లు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
రక్షణ అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలి
జనరల్ మేనేజర్ (సేఫ్టీ) కె. సాయి బాబు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే క్రమంలో ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ సూత్రాలను మరువరాదని జనరల్ మేనేజర్ (సేఫ్టీ) కె. సాయి బాబు సూచించారు. శుక్రవారం ఆయన శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె-7 గనిని సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్, గ్రూప్ ఏజెంట్ కుర్మ రాజేందర్, గని మేనేజర్ జె. తిరుపతి తదితరులు సేఫ్టీ జీఎం సాయి బాబుకు పూల మొక్కను అందించి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో సాయి బాబు మాట్లాడుతూ, రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, రక్షణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విధులు నిర్వర్తించేటప్పుడు రక్షణ పరికరాలను తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. ఉద్యోగుల రక్షణ అనేది వారి ఇంటి నుండే ప్రారంభం కావాలని ఆయన గుర్తు చేశారు. అనంతరం ఆయన గనిలోకి వెళ్లి అధికారులు అమలు చేస్తున్న రక్షణ విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశాల్లో ఉద్యోగులకు రక్షణ సూత్రాలపై అవగాహన కల్పించారు. గనిలో అధికారులు చేపడుతున్న పటిష్టమైన రక్షణ విధానాలను పరిశీలించి వారిని ప్రత్యేకంగా అభినందించారు.

‘స్పెషల్ లీవ్’తో సింగరేణి ఉద్యోగులకు తీవ్ర నష్టం
సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం
ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్ రావు
నస్పూర్, ఆర్.కె న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం విధులు నిర్వర్తిస్తున్న సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం ‘ఆన్ డ్యూటీ’కి బదులుగా ‘స్పెషల్ లీవ్’ వర్తింపజేయడాన్ని ఐఎన్టీయూసీ తీవ్రంగా ఖండించింది. ఇది ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీయడమేనని ఐఎన్టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా శంకర్ రావు మాట్లాడుతూ.. సింగరేణి ఉద్యోగులు ఎన్నికల విధుల్లో భాగంగా దూర ప్రాంతాలకు, రవాణా సౌకర్యాలు సరిగా లేని మారుమూల గ్రామాలకు వెళ్లి ఎంతో శ్రమకోర్చి తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని గుర్తుచేశారు. సాధారణంగా ‘లీవ్’ అనేది ఉద్యోగి తన సొంత పనులు లేదా వ్యక్తిగత అవసరాల కోసం విధులకు గైర్హాజరైనప్పుడు వినియోగించుకుంటారని తెలిపారు. కానీ, యాజమాన్యం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు వెళ్తున్న ఉద్యోగులకు ‘స్పెషల్ లీవ్’ ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్నవారిని సెలవులో ఉన్నట్లుగా పరిగణించడం సరైన విధానం కాదని హితవు పలికారు. స్పెషల్ లీవ్ విధానం వల్ల ఉద్యోగులు అనేక విధాలుగా నష్టపోతున్నారని ఆయన వివరించారు. ప్రధానంగా ఈ రోజులను వార్షిక హాజరులో పరిగణించకపోవడం వల్ల, ఉద్యోగులు భవిష్యత్తులో పొందాల్సిన ‘ఆర్జిత లీవుల’ పై కోత పడుతోందన్నారు. అలాగే విధుల్లో ఉన్నప్పుడు వచ్చే అలవెన్సులు, కంపెనీ ఇచ్చే ప్రోత్సాహక ఇన్సెంటివ్‌లు కోల్పోవడంతో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి. జనక్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినట్లు శంకర్ రావు తెలిపారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన జనక్ ప్రసాద్, వెంటనే సింగరేణి సంస్థ చైర్మన్, సంబంధిత మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు తెలిపారన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికీ ‘ఆన్ డ్యూటీ’ వర్తింపజేసి, వారికి ఎటువంటి ఆర్థిక నష్టం కలగకుండా చూసేందుకు ఐఎన్టీయూసీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
డిపాజిట్లపై అధిక వడ్డీ, బీమా సేవలు వినియోగించుకోవాలి
రీజినల్ మేనేజర్ బాలచంద్ర పట్కి
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సీతారాంపల్లి శాఖ 41 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం శాఖా కార్యాలయంలో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల రీజినల్ మేనేజర్ బాలచంద్ర పట్కి మాట్లాడుతూ.. సీతారాంపల్లి శాఖ 41 ఏళ్లుగా ఖాతాదారుల మన్ననలు పొందుతూ విజయవంతంగా ముందుకు సాగడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కెల్లా టిజిబిలోనే ప్రస్తుతం డిపాజిట్లపై అత్యధిక వడ్డీ లభిస్తోందన్నారు. ఖాతాదారులు వ్యవసాయ, గృహ, బంగారు రుణాలతో పాటు, బ్యాంకు అందించే ఇన్సూరెన్స్, పెన్షన్ పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. బ్యాంకు ద్వారా ఇన్సూరెన్స్ చేసుకున్న వారికి ఆపద సమయంలో అండగా నిలుస్తున్నామని, ఇటీవల ఒక బాధిత కుటుంబానికి రూ. 10.27 లక్షల క్లెయిమ్, మరొకరికి హెల్త్ ఇన్సూరెన్స్ పరిహారం అందజేశామని గుర్తుచేశారు. శాఖా మేనేజర్ నరసింహ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మెప్మా అధికారి నాగరాజు, సిబ్బంది, పలువురు ఖాతాదారులు పాల్గొని, శాఖ సేవలను కొనియాడారు.
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఘనంగా సింగరేణి సేవా సమితి 25వ ఆవిర్భావ వేడుకలు
శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి, ఆర్థిక స్వావలంబన సాధించడమే సింగరేణి సేవా సమితి ముఖ్య ఉద్దేశమని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. సింగరేణి సేవా సమితి 25వ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని ప్రగతి స్టేడియంలోని సిఈఆర్ క్లబ్లో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వృత్తి శిక్షణ తరగతులను (టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్) జీఎం శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమరాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటికే అనేకమంది మహిళలు సేవా సమితి ద్వారా ఉచిత శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందుతుండటం సంతోషకరమన్నారు. మహిళలు ఈ కోర్సులను నేర్చుకోవడంతో సరిపెట్టుకోకుండా, నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని, తద్వారా తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని ఆకాంక్షించారు.
ఆసక్తి ఉంటే మరిన్ని కొత్త కోర్సులు
సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమరాణి మాట్లాడుతూ.. శ్రీరాంపూర్ ఏరియాలో వృత్తి నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఆసక్తి గల మహిళలు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరై మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. మహిళలు ఆసక్తి చూపితే భవిష్యత్తులో మరిన్ని నూతన కోర్సులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, సీనియర్ పీవో ఎస్. సురేందర్, సేవా సెక్రటరీ కొట్టే జ్యోతి, శిక్షకులు, సేవా సభ్యులు పాల్గొన్నారు.

డిజిటల్ హెల్త్ రికార్డులతో వైద్య సేవల్లో పారదర్శకత
శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకే తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 56వ రక్షణ పక్షోత్సవాలలో భాగంగా బుధవారం నస్పూర్ డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన వార్షిక రక్షణ పక్షోత్సవాల వేడుకలను ఆయన రక్షణ వారోత్సవాల ఇన్స్పెక్షన్ కమిటీ కన్వీనర్, డిప్యూటీ సీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ.. వృత్తి సంబంధిత అనారోగ్య సమస్యలను పరిష్కరించడంలోనూ, సకాలంలో వైద్య సేవలు అందించడంలోనూ డిస్పెన్సరీ వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు. సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రతి ఉద్యోగి ఆరోగ్య వివరాలను ఆన్లైన్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో పొందుపరిచినట్లు తెలిపారు. డిజిటల్ హెల్త్ రికార్డుల లభ్యత వల్ల ఉద్యోగుల ఆరోగ్య పర్యవేక్షణ, వైద్య పరీక్షలు, నివేదికల జారీ ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా జరుగుతోందని వివరించారు.
- అవగాహనే రక్షణకు ఆయుధం
అనంతరం ఇన్స్పెక్షన్ కమిటీ కన్వీనర్ డాక్టర్ పి. రమేష్ బాబు మాట్లాడుతూ.. రక్షణ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం కేవలం వేడుకలు జరపడం కాదని, ఉద్యోగుల్లో ఆరోగ్య స్పృహను పెంచడమేనని తెలిపారు. వృత్తి సంబంధిత ప్రమాదాలను నివారించడం, గనుల్లో భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ప్రథమ చికిత్స, ఆరోగ్యకరమైన జీవనశైలి, మైనింగ్ సేఫ్టీ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఏరియా రక్షణాధికారి విజయ్ కుమార్, ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులు పి. హరిశంకర్ రావు, డాక్టర్ పి. శేషగిరి రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్, డాక్టర్ హుస్సేన్, ఇతర వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్సీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్‌కు ఐఎఫ్ టీయూ మెమోరండం
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్‌లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ వర్కర్లకు 11 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఐఎఫ్ టీయూ రాష్ట్ర నాయకులు డి. బ్రహ్మానందం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. కంటిన్యూషన్ ఆర్డర్ సాకుతో ట్రెజరీలో బిల్లులు ఆగిపోయాయని, ఫైనాన్స్ శాఖలో ఫైల్ పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతూ కాలయాపన చేయడం వల్ల కార్మికులు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టీయూ నాయకులు రాజన్న, సంపత్, రాజేశ్వరి, శారద, కవిత, లక్ష్మి, శ్యామల, అంజలి తదితరులు పాల్గొన్నారు.
రక్షణ చర్యల్లో రాజీ పడకూడదు
కార్పొరేట్ సేఫ్టీ జీఎం కె. సాయిబాబు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థలో ‘శూన్య ప్రమాదాల’ ను లక్ష్యంగా పెట్టుకొని ప్రతి విభాగం పనిచేయాలని, రక్షణ చర్యల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని కార్పొరేట్ సేఫ్టీ జనరల్ మేనేజర్ కె. సాయిబాబు అధికారులకు సూచించారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్‌తో కలిసి ఆయన ఆర్.కె-5 గనిని సందర్శించారు. ఈ సందర్భంగా గని కార్యకలాపాలను సమీక్షించి, గని ప్లాన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సీమ్లలో అమలు చేస్తున్న రక్షణ చర్యలు, భద్రతా ప్రమాణాలు మరియు సాంకేతిక పరికరాల వినియోగంపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కార్పొరేట్ సేఫ్టీ జీఎం కె. సాయిబాబు మాట్లాడుతూ.. గనుల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి వ్యక్తిగత రక్షణ పరికరాలు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. సేఫ్టీ డ్రిల్స్, మాక్ డ్రిల్స్, గ్యాస్ మానిటరింగ్, హజార్డ్ ఐడెంటిఫికేషన్, రూట్ కాజ్ అనాలిసిస్ వంటి పద్ధతులను క్రమం తప్పకుండా పాటించాలన్నారు. వెంటిలేషన్, సపోర్ట్ సిస్టమ్స్, డస్ట్ సప్రెషన్ సిస్టమ్స్ వంటి కీలక అంశాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి నివారించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. సురక్షితమైన పని వాతావరణం అనేది ఉద్యోగుల నిబద్ధత, పర్యవేక్షణాధికారుల నిరంతర పరిశీలన వల్లే సాధ్యమవుతుందని తెలిపారు.
లక్ష్యం దిశగా ఆర్.కె-5
శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్.కె-5 గనిలో రక్షణ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉద్యోగులందరూ రక్షణ పరికరాలు ధరిస్తూ ఉత్పత్తిలో భాగస్వాములవుతున్నారని, ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 2,70,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని తప్పక సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గని ఏజెంట్ శ్రీధర్, గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝా, గని రక్షణాధికారి శివయ్య, గని సర్వే అధికారి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి
వ్యవస్థాపక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికైన విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారి కస్తూరి నాగేశ్వర్‌ను మంచిర్యాల కలెక్టరేట్ ఏరియా వాకర్స్, హెల్త్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ఘనంగా సన్మానించారు. కస్తూరి నాగేశ్వర్ ప్రస్తుతం కలెక్టరేట్ ఏరియా వాకర్స్ హెల్త్ క్లబ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. బుధవారం ఉదయం వాకింగ్ అనంతరం నిర్వహించిన ఈ కార్యక్రమంలో, వాకర్స్ హెల్త్ క్లబ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో నాగేశ్వర్‌ను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ సందర్భంగా యోగేశ్వర్ మాట్లాడుతూ.. నాగేశ్వర్ నిగర్వి అని, నిత్యం వ్యాయామం చేస్తూ అందరితో ఎంతో కలివిడిగా ఉంటారని కొనియాడారు. ఆయన తన సేవా గుణంతో భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, సంపత్ కుమార్, శ్యాంసుందర్, జి. వెంకటేశం, అక్కల రమేష్, సాయి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొని నాగేశ్వర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.



