- మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్
- 02వ డివిజన్‌లో ముమ్మరంగా 99 రోజుల ప్రగతి ప్రణాళిక పనులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రజల ఆరోగ్యమే మున్సిపల్ కార్పొరేషన్ ప్రథమ కర్తవ్యమని మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళికతో పాటు ‘మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత’ కార్యక్రమంలో
భాగంగా శనివారం 02వ డివిజన్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టారు. ఈ పనులను డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్‌తో కలిసి మేయర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పారిశుద్ధ్య పనుల పురోగతిపై అధికారులకు తగిన సూచనలు చేశారు. పట్టణ అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు దర్ని మధుకర్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్‌లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 02వ డివిజన్ కార్పొరేటర్ పుట్ట యశోద, మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు భూపతి శ్రీనివాస్, నస్పూర్ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అజయ్ గౌడ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.







