KYATHAM RAJESH
- సీపీ, డీసీపీలకు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు
బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్: బెల్లంపల్లి పట్టణంలో చలామణి అవుతున్న నకిలీ విలేకరుల పై మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల డీసీపీ లకు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు ఫిర్యాదు చేశారు. బెల్లంపల్లి పట్టణంలో రిజిస్టర్ ప్రెస్ క్లబ్ ఉండగా మరో ప్రెస్ క్లబ్ ను చలామణి చేస్తూ కొందరు వ్యక్తులు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇందుకు స్పందించిన సీపీ, డీసీపీ లు నకిలీ విలేకరుల పై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. విలేకరుల పేరుతో ఎవరైనా అక్రమ వసూళ్ల కు పాల్పడితే వారిని గుర్తించి ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని అట్టి వారిపై తగు చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలోని సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీలలో ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రాలను ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తనయుడు కొక్కిరాల ఉదయ్ చరణ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొక్కిరాల ఉదయ్ చరణ్ రావు మాట్లాడుతూ, వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి, వేడి నుండి ఉపశమనం పొందడానికి కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, అంబలి పంపిణీ కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గత కొన్ని సంవత్సరాలుగా గెలుపు ఓటములు సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంబలి పంపిణీ కేంద్రాలు ప్రారంభించడం పట్ల పలువురు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ల వేణు, నాయకులు దర్ని మధు, కుమార్, సంపత్ రెడ్డి, అజయ్ గౌడ్, తిరుపతి, బండి పద్మ, నక్క రాజేశ్వరి, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- ప్రకృతి మిత్ర స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు గుండేటి యోగేశ్వర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: బాలల జన్మదిన వేడుకలు పర్యావరణానికి హాని కలగకుండా ప్రకృతి మిత్ర గా జరుపుకోవడం ఆదర్శనీయమని “ప్రకృతి మిత్ర” స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, పర్యావరణ వేత్త గుండేటి యోగేశ్వర్ అన్నారు. ఆదివారం రాత్రి మంచిర్యాల కార్పొరేషన్ పరిధి నస్పూర్ లోని ఓ మాక్స్ విల్లా కాలనీలో గుండేటి సుధీర్,శ్వేత దంపతుల కుమారుడు శౌర్య జన్మదిన దినాన్ని పురస్కరించుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్, బేకరీ కి సంబంధించిన కేక్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ లేకుండా ప్రకృతి సిద్ధమైన పుచ్చకాయతో కళాత్మకంగా రెండవ జన్మదిన కేక్ తయారు చేశారు. వేడుకలకు హాజరైన బాలలకు, ఆహ్వానితులకు వివిధ పోషకాలు గల ఫలాలు, కూల్ డ్రింక్స్ స్థానంలో సహజమైన పండ్ల రసాన్ని ఇచ్చారు. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు బాంబో పీల్ కాగితం, ఆకు డొప్పలు వినియోగించారు. దీపాలు ఆరిపే సంస్కృతికి బదులు దీపాలు వెలిగించి ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమానికి హాజరైన పర్యావరణ వేత్త యోగేశ్వర్ మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, జంక్ ఫుడ్స్ వినియోగంతో పర్యావరణం, ఆరోగ్యానికి జరిగే నష్టాలను వివరించారు. ప్రకృతి మిత్రగా ఆదర్శంగా జరుపుకున్న దంపతులకు పచ్చని మొక్కను కానుకగా అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గుండేటి సుధీర్, శ్వేత దంపతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆసక్తిగా హాజరై ఎంతో సంతోషం వ్యక్తం చేసి ప్రశంసలు కురిపించారు.
- మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల, ఆర్. కె న్యూస్: మంత్రి పదవి విషయంలో తనకు అన్యాయం జరిగితే దేనికైనా సిద్ధమేనని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో మంత్రి పదవి తనకు కాకుండా పార్టీ ఫిరాయింపు వలసవాదులకు ఇస్తే ఉమ్మడి ప్రజల గొంతు కోసినట్లేనని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్న తనకు అన్యాయం చేస్తారా అని అధిష్టానాన్ని ప్రశ్నించారు. మంచిర్యాల పోరాటాల గడ్డ అన్యాయం జరిగితే ఉద్యమిస్తారని అన్నారు. బీజేపీ, బి.ఆర్.ఎస్ పార్టీల చుట్టూ తిరిగిన వారిని అందలం ఎక్కించవద్దని కోరారు.
ఎమ్మెల్సీ విజయశాంతిని మర్యాదపూర్వకంగా కలిసిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులు, సినీ నటులు
ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ సినీ నటి విజయశాంతిని శుక్రవారం సాయంత్రం పలువురు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు, సినీ నటులు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల కష్టాలు, త్యాగాలు మరువలేనివి అని, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. ఎమ్మెల్సీ విజయశాంతిని కలిసిన వారిలో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఎం.బాబు రావు, ఏ.వేణుమాధవ్, సినీ నటులు, యూట్యూబ్ నిర్మాతలు, నటులు సుచరిత, రత్న శ్రీ హారిక, మహాలక్ష్మి, నిర్మాతలు ఇంద్రకంటి దీప, ఫేమస్ బుల్లెట్ బండి సాంగ్ నిర్మాత నిరుపమ, డబ్బింగ్ అరిస్టు స్రవంతి, ఎస్.బి రెడ్డి క్రియేషన్స్ ఎస్.బి రెడ్డి తదితరులు ఉన్నారు.