సింగరేణి పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభను కొనియాడిన శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల కంటే సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో నాణ్యమైన విద్య అందుతోందని చెప్పడానికి రెండు రాష్ట్రాల ఈసెట్ ఫలితాల్లో విద్యార్థులు సాధించిన ర్యాంకులే నిదర్శనమని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ కొనియాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన శ్రీరాంపూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను జీఎం కార్యాలయంలో సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ర్యాంకర్లకు మెమొంటోలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈసెట్ విజేతల వివరాలతో కూడిన గోడపత్రికను ఆవిష్కరించారు. మైనింగ్ విభాగంలో బొడ్డు మినీక్ష ఏపీ ఈసెట్లో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించగా, శ్రీపతి ఆధిత్య తెలంగాణ ఈసెట్లో 4వ ర్యాంకు సాధించి ప్రతిభ చాటారు. వీరితో పాటు మెకానికల్, మైనింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విభాగాలలో 500 లోపు 80 మంది, వెయ్యి లోపు 70 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి కళాశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు తెచ్చారు. సింగరేణి ఉద్యోగులకే కాకుండా ఈ ప్రాంత ప్రజలకూ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ఒక వరమని మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌లోనూ ఇలాగే రాణించి తల్లిదండ్రులకు, సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం సాగుతున్న అడ్మిషన్ల ప్రక్రియలో విద్యార్థులు ఈ కళాశాలలో చేరి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం ఎన్. సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, డీజీఎం (ఐఈడీ) రాజన్న, సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ కుర్మ రాజేందర్, డీజీఎం ఎన్. డినీల్ కుమార్‌తో పాటు కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.







