జూన్ 13న మంచిర్యాలలో 335 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలోనే ప్రారంభించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. కోల్ బెల్ట్ ప్రాంత శాసనసభ్యులు, మంత్రుల సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, కార్మికుల ప్రయోజనాలను కాపాడే దిశగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా నిజంగా అర్హులైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని భట్టి విక్రమార్క సూచించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, మధ్యవర్తిత్వాలకు తావులేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలన్నారు. కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు మంచిర్యాలలో శనివారం (జూన్ 13వ తేదీ) జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నట్లు వెల్లడించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల అంశాన్ని పరిష్కరించేందుకు నిబంధనల మేరకు న్యాయ సలహా తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిలో 2,657 పోస్టులను భర్తీ చేశామని, కారుణ్య నియామకాల గరిష్ట వయోపరిమితిని 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలకు పెంచామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. దేశంలోనే తొలిసారిగా సింగరేణి కార్మికులకు రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా, రూ. 10 లక్షల ఉచిత సహజ బీమా, కాంట్రాక్టు కార్మికులకు రూ. 40 లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించామన్నారు. గత రెండేళ్లలో రూ. 1500 కోట్లను లాభాల వాటా రూపేనా చెల్లించామని, కాంట్రాక్టు కార్మికులకు సైతం లాభాల బోనస్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒడిశా నైనీ బ్లాక్ అనుమతులతో పాటు రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లోనూ సింగరేణిని విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, పోటీ మార్కెట్లో సంస్థ నిలదొక్కుకోవడానికి ఉత్పత్తిని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.







