నాలుగు దశాబ్దాల నిస్వార్థ సేవలకు గుర్తింపుగా పురస్కారం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికులకు నాలుగు దశాబ్దాలుగా నిస్వార్థ సేవలు అందిస్తున్న ఐఎన్టీయూసీ నాయకుడు జెట్టి శంకర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘శ్రమ శక్తి’ అవార్డు అందుకున్నారు. మే డే వేడుకల్లో భాగంగా శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ డాక్టర్ బి. జనక్ ప్రసాద్ సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ అవార్డును అందజేసింది. బెల్లంపల్లిలో జన్మించిన జెట్టి శంకర్ రావు 1985లో సింగరేణి సంస్థలో ట్రేడ్స్మెన్గా తన వృత్తిని ప్రారంభించారు. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయన ఎన్ఎస్యూఐ ద్వారా ప్రజా జీవితంలోకి వచ్చారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి. సంజీవ రెడ్డి మార్గదర్శకత్వంలో కార్మిక సంఘంలో చేరిన శంకర్ రావు అంచెలంచెలుగా ఎదిగారు. పిట్ సెక్రటరీ నుండి కేంద్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకు వివిధ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఐఎన్టీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కార్మిక చట్టాలు, వేతనాలు, సంక్షేమ అంశాలపై ఉన్న అవగాహనతో సింగరేణి సంస్థలో అనేక చర్చలకు ప్రతినిధిగా వ్యవహరించారు. కార్మిక సంక్షేమంతో పాటు సామాజిక సేవా రంగంలోనూ శంకర్ రావు తన ముద్ర వేశారు. నస్పూర్ లో ఐఎన్టీయూసీ కార్యాలయ నిర్మాణం, యువత కోసం వ్యాయామశాల ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1995లో నస్పూర్ ఎంపీటీసీగా ఎన్నికై ప్రజాసేవ చేశారు. అప్రెంటిస్ విద్యార్థులకు శిక్షణ ఇస్తూ వారిని నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లుగా తీర్చిదిద్దారు. నిరంతర కృషికి గుర్తింపుగా గతంలో సింగరేణి సంస్థ నుండి పలుమార్లు ఉత్తమ ఉద్యోగి ప్రశంసలు అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం శంకర్ రావు మాట్లాడుతూ ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. తన ఎదుగుదలకు సహకరించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, డాక్టర్ సంజీవరెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు. శంకర్ రావుకు అవార్డు దక్కడంపై ఐఎన్టీయూసీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.







