- బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జ్ కాదాసి రవీందర్
- కలెక్టరేట్ ఎదుట 16వ రోజుకు చేరిన నిరాహార దీక్షలు
- పూర్తి మద్దతు ప్రకటించిన బీఎస్పీ నాయకులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న 17 వేల మంది నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జ్ కాదాసి రవీందర్ డిమాండ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ వివిధ క్యాడర్లకు చెందిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరాహార దీక్షలు బుధవారంతో 16వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని బీఎస్పీ నాయకులు సందర్శించి, ఉద్యోగుల పక్షాన నిలబడి దీక్షలో స్వయంగా పాల్గొంటూ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అనంతరం కాదాసి రవీందర్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా వైద్యారోగ్య శాఖలో అరకొర వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్న ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను నిలబెడుతున్న వీరి సేవలను గుర్తించి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, ఈసీ సభ్యురాలు సెట్టి ప్రవళిక, మంచిర్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ పెట్టం చంద్రశేఖర్, నియోజకవర్గ అధ్యక్షుడు బండారి రాజ్‌కుమార్, చెన్నూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దుర్గం గంగారాం, చెన్నూర్ అధ్యక్షుడు గాజుల శంకర్, ఉపాధ్యక్షుడు ఎండీ మాతిన్ ఖాన్, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు దాగం శ్రీనివాస్, బామ్‌సెఫ్ జిల్లా కన్వీనర్ సెట్టి శంకరయ్య, నాయకులు చింతల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.








