సింగరేణిలో సమ్మె సైరన్ మోగించేందుకు ఏఐటీయూసీ సన్నద్ధం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో నెలకొన్న కార్మిక సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో మే రెండో వారంలో సమ్మె నోటీసు అందజేస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ హెచ్చరించారు. గత ఏడెనిమిది నెలలుగా కార్మికుల పెండింగ్ సమస్యలపై యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వారు ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, కలిసి వచ్చే కార్మిక సంఘాలతో చర్చించి సమ్మె తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. గుర్తింపు సంఘం ఎన్నికల అనంతరం డైరెక్టర్లు, సీఎండీలు మారడం వల్ల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని నాయకులు విమర్శించారు. గతంలో జరిగిన చర్చల్లో అంగీకరించిన అంశాలను కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యంగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల తీవ్ర అనారోగ్యంతో ఉన్న కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, అనారోగ్యంతో ఉన్న వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మారుపేర్లు, విజిలెన్స్ కేసుల్లో ఉన్న కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వడంలో యాజమాన్యం కాలయాపన చేస్తోందని వారు పేర్కొన్నారు. లీగల్ ఒపీనియన్ పేరుతో ఏడాది కాలంగా ఫైళ్లను పెండింగ్‌లో పెట్టి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మైనింగ్, క్లరికల్, ట్రేడ్స్‌మెన్ సమస్యలతో పాటు సొంత ఇంటి పథకం అమలు చేయాలని, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 51 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, డిస్మిస్ కార్మికులకు పునర్నియామక అవకాశం కల్పించాలని కోరారు. మే మొదటి వారంలోగా చర్చలకు రాకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు.







