- ట్రస్మా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్
- ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ రేపు ప్రైవేట్ పాఠశాలల బంద్
నస్పూర్, ఆర్.కె న్యూస్: విద్యాబుద్ధులు నేర్పిన గురువులను హతమార్చే స్థాయికి విద్యార్థులు దిగజారడం యావత్ సమాజానికి తీరని మచ్చ అని మంచిర్యాల జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించే ప్రైవేట్ పాఠశాలల బంద్‌కు జిల్లా ట్రస్మా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ సంస్కృతి, సెల్‌ఫోన్లు, హింసాత్మక కంటెంట్ విద్యార్థులను పెడదోవ పట్టిస్తున్నాయని ట్రస్మా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రూపారెడ్డి హత్య కేసు నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులకు పూర్తి రక్షణతో పాటు క్రమశిక్షణ అమలులో తగిన హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలు ఈ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ట్రస్మా సీసీసీ నస్పూర్ మండల అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ, రూపారెడ్డి హత్య ఘటన రాష్ట్రాన్ని తీవ్రంగా కలచివేసిందన్నారు. తల్లిదండ్రుల అతి గారాబం, క్రమశిక్షణ లోపం విద్యార్థులను బాధ్యతారాహిత్యానికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, జిల్లా ట్రెజరర్ దండ రామకృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ రేగల్ల ఉపేందర్, నస్పూర్ మండల గౌరవ అధ్యక్షుడు బత్తిని దేవన్న, శ్రీనివాస్, సెక్రటరీ ఉట్ల సత్యనారాయణ, ట్రెజరర్ అంబాల రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ అమన్ ప్రసాద్, లిటిల్ రైడర్స్ హెచ్ఎం స్రవంతి, రేడియంట్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







