- నేతకాని మహర్ సంక్షేమ సంఘం నాయకులు
- రాష్ట్రంలో 15 లక్షల జనాభా ఉంటే లక్షన్నరగా చూపడం దారుణం.. నేతకాని మహర్ సంక్షేమ సంఘం ఆవేదన
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఎస్సీ వర్గీకరణ, కులగణనలో నేతకాని మహర్ సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరిగిందని నేతకాని మహర్ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సునార్కర్ రాంబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి గోళ్ల రాజమల్లు ఆరోపించారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో నేతకానీలు 15 లక్షలకు పైగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇటీవల జరిపిన కుల గణనలో కేవలం 1,70,254 మంది ఉన్నట్లు చూపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తప్పుడు గణాంకాల వల్ల తాము ఎస్సీ రిజర్వేషన్లలో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నేతకానీలను మాలసాలెలతో కలపడంపై నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాలసాలె కులస్తులకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాలలతో కలిపి ఉంచడం వల్ల నేతకాని కులస్తులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోతున్నారని వివరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వాస్తవ జనాభా ప్రాతిపదికన తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేతకాని కార్పొరేషన్ చైర్మన్‌ను తక్షణమే నియమించాలని రాష్ట్ర యువజన అధ్యక్షుడు అనపర్తి యువరాజు కోరారు. కార్పొరేషన్‌కు భారీగా నిధులు కేటాయించి కులస్తుల అభివృద్ధికి కృషి చేయాలని విన్నవించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు కామెర అనూష మాట్లాడుతూ మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జాడి తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి కొండగొర్ల శ్రీనివాస్, నస్పూర్ మండల అధ్యక్షుడు దుర్గం శివరాం, బేంబడి గురువయ్య, ముడిమడుగుల శ్రీనివాస్, జునుగురు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.



