నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఓటు జీఎంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ ప్రసాద్‌ను బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, బీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయనతో వివరంగా చర్చించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కృష్ణ ప్రసాద్ విజయవంతంగా విధులు నిర్వహిస్తూ, ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, బ్రాంచ్ కార్యదర్శి మారుతి, బద్రి బుచ్చయ్య, సహాయ కార్యదర్శి చంద్రమోహన్, జాయింట్ సెక్రటరీ రఘురాం, నాయకులు తిరుపతి, సాంబయ్య, పిట్ సెక్రటరీలు వినోద్, మనోజ్, మదన్, నరేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
25 July 2026
మండల వ్యవసాయ అధికారి జి. వినోద్ కుమార్
సోన్, ఆర్.కె న్యూస్: మండలంలోని న్యూ వెల్మల్ గ్రామంలో శనివారం రైతులకు ఎల్-నీనో పరిస్థితులు, వాటి ప్రభావం, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి జి. వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఎల్-నీనో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి వనరుల లభ్యత తగ్గే పరిస్థితులు ఏర్పడవచ్చని తెలిపారు. ముఖ్యంగా కాలువల ద్వారా సాగునీరు అందే ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గే అవకాశమున్నందున రైతులు పంటల ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవాలని సూచించారు.అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి (మెట్ట) పంటలైన పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, నువ్వులు, జొన్న, సజ్జ వంటి పంటలను సాగు చేయాలని సూచించారు.అలాగే వర్షపు నీటిని వృథా కాకుండా ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాంలు, కందకాల ద్వారా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు నీటి సంరక్షణ పద్ధతులపై వ్యవసాయ అధికారులతో చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు నాగన్న, రాజేందర్, రాజలింగం, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఐకే-1ఏ గనిని ఏఐటీయూసీ గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కే. బాజీ సైదా తదితర నాయకులు శనివారం సందర్శించారు. గనిలోని ప్రతి విభాగాన్ని పరిశీలిస్తూ, కార్మికులను నేరుగా కలిసి పని ప్రదేశాల్లో వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అవసరమైన పనిముట్లు సరిపడా అందుబాటులో లేకపోవడం వల్ల పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నామని కార్మికులు వివరించారు. అలాగే గనిలోకి వెళ్లే మ్యాన్‌వే వద్ద వర్షం, ఎండల నుండి రక్షణ పొందేందుకు శాశ్వత షెడ్డు నిర్మించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న వాష్‌రూమ్‌లు సరిపోవడం లేదని, వాటి సంఖ్యను పెంచి క్రమం తప్పకుండా పరిశుభ్రం చేయించాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు తాగునీటి సౌకర్యం, భద్రతా పరికరాల సరఫరా, ఇతర మౌలిక వసతుల కల్పనపై వినతులు అందించారు. కార్మికులు తెలిపిన ప్రతి సమస్యను సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని ఏఐటీయూసీ నాయకులు స్పష్టమైన హామీ ఇచ్చారు. కార్మికుల సంక్షేమం, భద్రత, మెరుగైన పని వాతావరణం కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిట్ కార్యదర్శి నవీన్ రెడ్డి, నాయకులు శ్రీకాంత్, సురేష్, నరసయ్య, సురేష్, కేశవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



