సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన బాధిత కుటుంబాలను బుధవారం బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్‌కిషన్ రెడ్డి పరామర్శించారు. గత శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన దేవుల అక్షయ్, పడాల మహేష్‌ల కుటుంబాలను సందర్శించి, మృతుల తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని ఓదార్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ సోన్ మండల అధ్యక్షుడు సాయారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ముత్యం రెడ్డి, సల్ల ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
9 September 2026
🔴 ఎస్టీ బాలుర వసతిగృహంలో ఘనంగా కాళోజి నారాయణరావు జయంతి
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: ప్రజాకవి కాళోజి నారాయణరావు తన రచనలు, కవిత్వం ద్వారా ప్రజా సమస్యలను, సామాజిక అసమానతలను నిర్భయంగా ఎత్తిచూపిన గొప్ప పోరాటయోధుడు అని ఐక్య విద్యార్థి సంఘాల నాయకుడు చిప్పకుర్తి శ్రీనివాస్ కొనియాడారు. ప్రజాకవి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతిగృహంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం కాళోజి చేసిన రాజీలేని పోరాటం, ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిన ఆయన సాహిత్యం నేటి తరానికి నిరంతర స్ఫూర్తిదాయకమని శ్రీనివాస్ పేర్కొన్నారు. కాళోజి ఆశయ సాధనకు విద్యార్థులు, యువత సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఐక్యంగా పోరాడాలని సూచించారు. కాళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంతో పాటు ప్రజా చైతన్య దినోత్సవంగా నిర్వహించాలని, ఆయన సాహిత్య సంపదను విద్యార్థులకు మరింత చేరువ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు పూరెళ్ల నీతిష్, బచ్చలి అభిరామ్, గార కుమార్, వసతిగృహ విద్యార్థులు పాల్గొన్నారు.
సింగరేణి విశ్రాంత కార్మికులకు కనీస పెన్షన్ రూ.15 వేలు ఇవ్వాలి: గజ్జెల్లి వెంకటయ్య
నస్పూర్‌లో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
సీపీఆర్ఎంఎస్ పరిమితి రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్: 20 తీర్మానాలకు ఆమోదం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థలో దశాబ్దాల తరబడి సేవలందించిన విశ్రాంత కార్మికులకు కనీస పెన్షన్ నెలకు రూ.15 వేలు చెల్లించాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య డిమాండ్ చేశారు. బుధవారం నస్పూర్ మండల కేంద్రంలోని సింగరేణి గార్డెన్స్‌లో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు రాళ్లబండి రాజన్న అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గజ్జెల్లి వెంకటయ్య మాట్లాడుతూ సంస్థలో 35 నుంచి 45 ఏళ్ల పాటు సేవలందించిన సుమారు 16,900 మంది రిటైర్డ్ కార్మికులు నెలకు కేవలం రూ.350 నుంచి రూ.1000 లోపు పింఛను పొందుతూ తీవ్ర దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని పింఛనుతో వృద్ధాప్యంలో సైతం దినసరి కూలీలుగా, వ్యవసాయ పనులకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. గత 28 ఏళ్లుగా పెన్షన్ పెంచకపోవడం దారుణమని, ప్రభుత్వాలు, కోల్ బెల్ట్ ప్రజాప్రతినిధులు తమ సమస్యలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులకు అమలు చేస్తున్న డబుల్ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీపీఆర్ఎంఎస్ మెడికల్ కార్డు పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను విశ్రాంత కార్మికులకు కేటాయించాలని కోరారు. 2017 నుంచి గ్రాట్యుటీ రూ.20 లక్షల పెంపును వర్తింపజేయాలని, బ్యాంకుల ద్వారా రూ.30 లక్షల ప్రమాద బీమా అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో మొత్తం 20 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ డిమాండ్ల ప్రతులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, సీఎంపీఎఫ్ ట్రస్టీ బోర్డు చైర్మన్, కోల్ ఇండియా చైర్మన్లకు పంపుతామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పూదరి కృష్ణ, గౌరవ సలహాదారు పెట్టం లక్ష్మణ్, ఉపాధ్యక్షులు నల్లగొండ సదాశివచారి, ఎ. గంగన్న, కోశాధికారి పూసాల వెంకటరత్నం, నాయకులు లక్ష్మీనారాయణ, దొంతుల సాయి, సుంకరి రమేష్, రాజమల్లు, పోతు రవీందర్ రెడ్డి, బోనగిరి కృష్ణ, గట్టు ప్రమోద్, హన్మంతరావు, సాయన్న, రామయ్య, మల్లేష్, జూకంటి సారయ్య, గూడూరి యాదిరెడ్డి, గుర్రాల కృష్ణారెడ్డి, కోల సత్తయ్య, కె. సత్యనారాయణ, వీరాచారి, కొమురయ్య, మధుసూదన్, కె. శంకర్, చంద వైకుంఠం, బూర్ల జ్ఞాణి తదితరులు పాల్గొన్నారు.





