32వ డివిజన్లో నూతన గృహ ప్రారంభం..
31, 32 డివిజన్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసిన మేయర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: అర్హులైన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆత్మగౌరవంతో కూడిన సొంతింటిని కల్పించడమే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన సంకల్పం అని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. సోమవారం కార్పొరేషన్ పరిధిలోని 31, 32వ డివిజన్లలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల నూతన గృహ ప్రారంభోత్సవ, నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత 32వ డివిజన్‌కు చెందిన లబ్ధిదారులు కొండ సునీత – సత్యనారాయణ దంపతులు నిర్మించుకున్న నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి మేయర్ ధర్ని మధుకర్ – సుజాత దంపతులు హాజరై రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. అనంతరం ఇదే డివిజన్లో ఇల్లు మంజూరైన పూదరి అనూష – సంపత్ దంపతుల నూతన గృహ నిర్మాణానికి మేయర్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అలాగే 31వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డితో కలిసి లబ్ధిదారురాలు ముక్కెర మౌనిక నూతన గృహ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ.. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ప్రత్యేక చొరవ, నిరంతర కృషి, మార్గదర్శకత్వంతో నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని, నాణ్యతతో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో హౌసింగ్ బోర్డు అధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, డివిజన్ల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




