-
మంచిర్యాల మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
-
రూ. 10 కోట్ల వ్యయంతో నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: నూతన ఆలయ నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా పూర్తై, రానున్న గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అందుబాటులోకి రావాలి. ఈ పవిత్ర ఆలయం భక్తులకు మరింత ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించాలని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆకాంక్షించారు. మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా గురువారం నిర్వహించిన నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమాన్ని జరిపించారు. కొక్కిరాల సురేఖ ప్రత్యేక పూజలు చేయగా, అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు. పుర ప్రముఖుల కోరిక మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు చొరవతో దేవాదాయ శాఖ ఆగమ శాస్త్ర నియమాలు, స్థపతుల సూచనల ప్రకారం ఉత్తర ముఖ ద్వారంతో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పరమశివుడు, శ్రీ వాసవి మాత ఆలయాల నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ప్రజలందరిపై ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సురేఖ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ముక్త రవి, అర్చకులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కొత్త రాజేశం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అర్కాల హేమలత, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








