యువశక్తితోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం
మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలపడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాజీ డీసీసీ కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన దాదాపు 150 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజా మాజీ కౌన్సిలర్ మజీద్ ఆధ్వర్యంలో, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రేగుంట వెంకటేష్ నేతృత్వంలో ఈ యువకులంతా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ యువకులందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
యువతదే కీలక పాత్ర
ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆకాంక్షను సాకారం చేయడానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావడం హర్షణీయమన్నారు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని యువశక్తి భారతదేశానికి అతిపెద్ద బలమని ఆమె పేర్కొన్నారు. ఈ యువశక్తి సరైన మార్గంలో పయనించి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, ఇతర సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







