సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్
అలసత్వం వహిస్తే ఫిబ్రవరిలో పెన్షన్ నిలిపివేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి వ్యాప్తంగా దాదాపు 11 వేల మంది పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను ఇంకా సమర్పించలేదని, పెన్షన్ నిలిచిపోకుండా ఉండాలంటే వెంటనే స్పందించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ కోరారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎంపిఎఫ్ అధికారులతో మాట్లాడిన వివరాలను వెల్లడించారు. నవంబర్ మాసంలో లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించని వారికి జనవరి 1, 2026న అందాల్సిన పెన్షన్ నిలిపివేయబోమని అధికారులు స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. అయితే, జనవరి మొదటి వారంలోపు కూడా సర్టిఫికెట్లు సమర్పించని పక్షంలో, ఫిబ్రవరి 1న అందాల్సిన జనవరి నెల పెన్షన్ నిలిపివేయ బడుతుందని హెచ్చరించారు. పెన్షన్ ఆగకుండా ఉండేందుకు పెన్షనర్లు ఇకపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను మొబైల్ యాప్ ద్వారా కానీ, సీఎంపిఎఫ్ కార్యాలయాల్లో లేదా సమీప ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా కానీ వెంటనే సమర్పించాలని వేణు మాధవ్ సూచించారు.







