శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
ఏరియాలో 354 మందికి సర్వీస్ లింక్డ్ ప్రమోషన్లు
నస్పూర్, ఆర్.కె న్యూస్: నూతన సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ ఆర్.కె-7 గనిని సందర్శించి ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, జనరల్ మేనేజర్ కార్యాలయంలోనూ, ఆర్.కె-7 గనిలోనూ నిర్వహించిన కార్యక్రమాలలో ఉద్యోగులకు సర్వీస్ లింక్డ్ ప్రమోషన్ ఆర్డర్ కాపీలను జీఎం స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం 354 మంది ఉద్యోగులకు పదోన్నతులు (సర్వీస్ లింక్డ్ ప్రమోషన్లు) అందజేయడం సంతోషదాయకమన్నారు. సంస్థ అభివృద్ధి కోసం ప్రతి ఉద్యోగి తమ పనిని పూర్తి ఏకాగ్రతతో, రక్షణ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. రక్షణపై తీసుకునే శ్రద్ధే ప్రమాదరహిత సింగరేణికి పునాది అని ఉద్ఘాటించారు. సంస్థలో నూతనంగా చేరిన ఉద్యోగులు గైర్హాజరు కాకుండా క్రమం తప్పకుండా విధులకు హాజరుకావాలని జీఎం సూచించారు. సంస్థలో వారికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగాలని ఆకాంక్షించారు. నిబద్ధతతో పనిచేసే వారికి సంస్థలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్.కె-7 గని ఇప్పటివరకు 94 శాతం ఉత్పత్తిని సాధించడం పట్ల జీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన మూడు నెలల కాలంలో నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని వంద శాతం చేరుకోవడానికి ప్రతి ఒక్క ఉద్యోగి, అధికారి కంకణబద్ధులై కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు తగిన ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఆర్.కె-7 గని ఏజెంట్ కుర్మ రాజేందర్, డీజీఎంలు ఎస్. అనిల్ కుమార్ (పర్సనల్), ఆనంద్ కుమార్, ఆర్.కె-7 గని మేనేజర్ తిరుపతి, క్వాలిటీ మేనేజర్ కె. వెంకటేశ్వర్ రెడ్డి, సీనియర్ పీవోలు ఎస్. సురేందర్, మురళి, ఆర్.కె-7 గని సంక్షేమాధికారి సంతన్, గుర్తింపు సంఘం నాయకులు కొట్టే కిషన్ రావు, సారయ్య, సందీప్ తదితరులు పాల్గొన్నారు.








