జిల్లా కలెక్టర్‌కు టీఎస్ యూటీఎఫ్ వినతి
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లాలో గత కొద్ది రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉన్నందున విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా పాఠశాలల పనివేళల్లో మార్పులు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గుండారపు చక్రపాణి, ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజావేణు మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత విపరీతంగా పెరిగిందన్నారు. ఉదయం వేళల్లో పొగమంచు, చలి గాలుల కారణంగా చిన్నపిల్లలు, విద్యార్థులు పాఠశాలలకు సమయానికి హాజరుకావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చలి కారణంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం కూడా గణనీయంగా తగ్గుతోందని వారు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, చలి తీవ్రత తగ్గే వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల సమయాన్ని ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు మార్పు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వి. కిరణ్ కుమార్, జిల్లా కోశాధికారి బి. కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు జైపాల్, బారికి రావ్, తులసిపతి, రవికుమార్, తిరుపతి, శ్రీనివాస రెడ్డి, పోచన్న, లక్ష్మి రాజం, అయూబ్ ఖాన్, రవీందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.







