- అన్ని ఏరియాల జీఎం లకు డైరెక్టర్ సూచన
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో బొగ్గు నాణ్యతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని, తగిన గ్రేడ్ బొగ్గు సరఫరాకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లను ఆదేశించారు. కొత్తగూడెం కార్పోరేట్ కార్యాలయం నుండి ఆయన ఏరియాల జనరల్ మేనేజర్లు మరియు క్వాలిటీ విభాగం అధికారులతో సోమవారం ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు బొగ్గు మార్కెట్ లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఉందని, నాణ్యతా ప్రమాణాలు లేని బొగ్గును వినియోగదారులు స్వీకరించడం లేదని, కనుక బొగ్గు ఉత్పత్తి ప్రదేశం నుంచి మొదలుకొని వినియోగదారులకు పంపించే లోడింగ్ ప్రాంతం వరకు విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. నాణ్యత ప్రమాణాల పాటింపుకు వివిధ ఏరియాల్లో తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) బి. వెంకన్న, జనరల్ మేనేజర్ (సీపీపీ) ఎ. మనోహర్, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్, మార్కెటింగ్) టి. శ్రీనివాస్, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.







