వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం
ఆశీర్వదించిన వృద్ధులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని శ్రీరాంపూర్‌కు చెందిన శ్రీపతి రాములు-కల్పన దంపతులు తమ కుమార్తె శ్రీపతి కీర్తి జన్మదినాన్ని బుధవారం వినూత్నంగా నిర్వహించి సేవా గుణాన్ని చాటుకున్నారు. ఆర్భాటాలకు పోకుండా స్థానిక సాయి దృష్టి అందుల పాఠశాల, వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి పదిమందికి స్ఫూర్తిగా నిలిచారు. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేస్తున్న తమ ఏకైక కుమార్తె ఈ వేడుకకు స్వయంగా హాజరు కాలేకపోయినప్పటికీ, తల్లిదండ్రులు ఆమె పేరిట ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. ప్రస్తుత కాలంలో శుభకార్యాలను బంధుమిత్రుల మధ్య వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఆడంబరంగా జరుపుకోవడం పరిపాటిగా మారింది. అటువంటి విలాసాలకు దూరంగా, సమాజంలో నిరాదరణకు గురైన వృద్ధుల మధ్య కుమార్తె పుట్టినరోజును జరపడం పట్ల పలువురు ప్రశంసలు కురిపించారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులు శ్రీపతి కీర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని నిండు మనసుతో దీవించారు. ఈ సందర్భంగా శ్రీపతి రాములు-కల్పన దంపతులు మాట్లాడుతూ తమ కుమార్తె జన్మదినాన్ని వృద్ధాశ్రమంలో నిర్వహించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో నిరాశ్రయులైన వృద్ధులకు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ఇలాంటి చిన్న ప్రయత్నాలు ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.







