రైతు దంపతులకు ఘన సన్మానం; సంస్కృతిని చాటిన విద్యార్థులు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్ 1 ఆవరణలో శుక్రవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముందస్తు సంబరాలు వైభవంగా జరిగాయి. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏజీఎం అరవింద రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులకు మన పండుగల విశిష్టతను, రైతు ప్రాముఖ్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు.
పండుగ వేడుకల్లో భాగంగా సమాజానికి వెన్నెముకైన రైతును గౌరవించుకోవడం విశేషం. కార్యక్రమంలో ఒక రైతు దంపతులను ముఖ్య అతిథి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏజీఎం అరవింద రెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ మన సంస్కృతిలో అంతర్భాగమని, పంట చేతికొచ్చే వేళ రైతు జరుపుకునే గొప్ప పండుగ అని కొనియాడారు. చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు హాజరై పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు. విద్యార్థుల కోలాహలంతో పాఠశాల ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సంజీవ్ కుమార్, హైస్కూల్ కోఆర్డినేటర్ నాగరాజు, ప్రైమరీ కో-ఆర్డినేటర్లు జయశ్రీ, రోజా, ప్రైమరీ ప్రిన్సిపల్ స్రవంతి, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పాల్గొన్నారు.








