- నస్పూర్లో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు
నస్పూర్, ఆర్.కె న్యూస్: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించినప్పుడే క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని సీసీసీ నస్పూర్ ఎస్సై ఎం. ప్రశాంత్ పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం సీసీసీ నస్పూర్ పరిధిలోని సంఘం మల్లయ్యపల్లి, సీసీసీ కార్నర్ ఆటో స్టాండ్ వద్ద ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్సై కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాపాయమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, నలుగురి కంటే ఎక్కువ మందిని కూర్చోబెట్టడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన ప్రయాణం కుటుంబాలకు భరోసా ఇస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.







