యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ వెల్లడి
భారీగా చేరికలు: జిల్లా నూతన కమిటీ ఎన్నిక
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి హెచ్‌ఎంఎస్ యూనియన్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ప్రకటించారు. ఆదివారం నస్పూర్‌లోని హెచ్‌ఎంఎస్ కార్యాలయంలో అసంఘటిత కార్మికుల సమావేశం నిర్వహించారు. ఏరియా వైస్ ప్రెసిడెంట్ వంటకాల అనిల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆటో డ్రైవర్లు, అడ్డ కూలీలు, తాపీ మేస్త్రీలతో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హెచ్‌ఎంఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెల్ది సుదర్శన్ సమక్షంలో, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ నాయకత్వంలో 40 మంది ముఖ్య నాయకులు యూనియన్‌లో చేరారు. రియాజ్ అహ్మద్ వారికి కండువాలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. కేవలం సంఘటిత రంగమే కాకుండా, అసంఘటిత రంగ కార్మికుల హక్కుల కోసం కూడా యూనియన్ నిరంతరం అండగా నిలుస్తుందని ఈ సమావేశంలో తీర్మానించారు.
మంచిర్యాల జిల్లా కమిటీ ఎన్నిక: అనంతరం హెచ్‌ఎంఎస్ మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నరెడ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సాయి కృష్ణారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కోండ్ర శంకర్ నియమితులయ్యారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని రియాజ్ అహ్మద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు మీస కొమురయ్య సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.








