రహదారి భద్రతపై అవగాహన సదస్సులో ఇన్స్పెక్టర్ శ్రీలత పిలుపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ శ్రీలత పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 3 వీటీసీ శిక్షణ కేంద్రంలో శనివారం రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న రహదారి ప్రమాదాలు పెద్ద సమస్యగా మారాయని శ్రీలత ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. హత్యల ద్వారా జరుగుతున్న మరణాల కంటే రహదారి ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగా ఉండటం గమనార్హమని తెలిపారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా, వాహనదారులు తమ వ్యక్తిగత బాధ్యతగా నిబంధనలు పాటించినప్పుడే మెరుగైన ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారని వాహనదారులను హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే సమయంలో సీట్ బెల్ట్ ధరించడం మర్చిపోవద్దని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మేకల సంతోష్ కుమార్, పోలీసు సిబ్బంది, సింగరేణి అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.








