జన్నారం డివిజన్లోని 40 బీట్లలో సన్నాహాలు.. వాలంటీర్ల భాగస్వామ్యం
జన్నారం, ఆర్.కె న్యూస్: కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని జన్నారం అటవీ డివిజన్లో ఈ నెల 20 నుండి 25 వరకు ఆరు రోజుల పాటు అఖిల భారత పులుల గణన నిర్వహించనున్నారు. ఇంధన్పల్లి, జన్నారం, తాళ్ళపేట అటవీ రేంజ్ పరిధిలోని 40 బీట్లలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అటవీ రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, యానిమల్ టైగర్ ట్రాకర్ల ఆధ్వర్యంలో జంతువుల ఉనికిని రికార్డు చేయనున్నారు. పులులతో పాటు ఇతర మాంసాహార, శాకాహార జంతువులు, పక్షులు, వృక్ష సంపద వివరాలను ఈ గణనలో నమోదు చేస్తారు. శాకాహార జంతువులైన జింకలు, దుప్పుల లెక్కింపు కోసం మూడు రోజుల పాటు రెండు కిలోమీటర్ల సరళ రేఖీయ మార్గంలో (ట్రాన్సెక్ట్ లైన్) ఆరు సార్లు నడుస్తూ సమాచారాన్ని సేకరిస్తారు. మాంసాహార జంతువుల ఉనికిని గుర్తించేందుకు ప్రతి బీటులో 15 కిలోమీటర్ల మేర నడుస్తూ పాదముద్రలు, విసర్జితాల ఆధారంగా సంఖ్యను నిర్ధారిస్తారు. రాబందులు, వివిధ పక్షి జాతులపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. జంతువులతో పాటు అడవిలోని చెట్లు, పొదలు, గుల్మాలు, గడ్డి జాతుల విస్తరణను అధికారులు రికార్డు చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వన్యప్రాణి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. వాలంటీర్ల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పారదర్శకంగా గణన పూర్తి చేసేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది.








