- సీట్ల కేటాయింపుపై బాల్క సుమన్ హామీ
రామకృష్ణపూర్, ఆర్.కె న్యూస్: స్థానిక పురపాలక ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. కాంగ్రెస్తో ఉన్న పొత్తును తెంచుకున్న సిపిఐ నేతలు శనివారం బిఆర్ఎస్తో చేతులు కలిపారు. పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించాల్సిన వార్డులను ఇవ్వకపోగా, స్థానికంగా పార్టీకి ఉనికి లేదని కాంగ్రెస్ నాయకులు అవమానకరంగా మాట్లాడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిపిఐ నాయకులు వెల్లడించారు. కాంగ్రెస్తో కలిసి సాగడం సాధ్యం కాదని భావించిన సిపిఐ నాయకత్వం, బిఆర్ఎస్తో కలిసి ఎన్నికల బరిలో దిగాలని నిశ్చయించుకున్నట్లు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. ఈ సందర్భంగా చెన్నూర్ మాజీ శాసనసభ్యుడు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ మాట్లాడుతూ సిపిఐకి తగిన గౌరవం కల్పిస్తామని, సముచితంగా సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. బిఆర్ఎస్-సిపిఐ కూటమి ప్రజా సమస్యల అజెండాతో ఎన్నికలకు వెళ్తుందని, ప్రజల ఆదరణతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కలవేన శంకర్, లక్ష్మణ్, మిట్టపల్లి శీను, అక్బర్ అలీ సహా రెండు పార్టీల ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.







