ఎస్సార్పీ ఓసిపీ కన్వెన్స్ డ్రైవర్ల జనరల్ బాడీ సమావేశం.. వేతనాల దోపిడీపై ఆగ్రహం
నస్పూర్, ఆర్.కె న్యూస్: కన్వెన్స్ డ్రైవర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిఐటియు కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ అన్నారు. శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోని ఎస్సార్పీ ఓసిపీలో శనివారం పిట్ కమిటీ అధ్యక్షుడు కాసిపేట రాజేశం అధ్యక్షతన నిర్వహించిన కన్వెన్స్ డ్రైవర్ల జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓసిపీలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రైవర్ల మౌలిక వసతులను అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని శ్రీనివాస్ పేర్కొన్నారు. టెండర్ నిబంధనల ప్రకారం డ్రైవర్లకు రావాల్సిన ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని దూలం శ్రీనివాస్ విమర్శించారు. డ్రైవర్ల వేతనాల విషయంలో బహిరంగంగానే దోపిడీ జరుగుతోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు ఇవ్వాలని కోరితే యజమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరించడం సరికాదని ఆయన మండిపడ్డారు. డ్రైవర్ల సమస్యలపై యజమానులు, అధికారులు తక్షణమే సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు వేతనాల పెంపుతో పాటు పని భద్రత కల్పించాలని, డ్రైవర్ల కోసం రెస్ట్ షెడ్లు ఏర్పాటు చేయాలని, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. లేని పక్షంలో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని దూలం శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిట్ కమిటీ కార్యదర్శి సంపత్ రావు, నాయకులు సతీష్, రాజాలింగు, రాఘవేంద్ర, సురేష్, రవి, నవీన్, నీరజ్, విద్యాసాగర్, శశిధర్, తోట శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.







